లాక్‌డౌన్‌ విధింపు, విధి విధానాలను విమర్శిస్తూ...  మక్కల్‌నీది మయ్యం  అధినేత కమల్ హాసన్... ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. నోవెల్ కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌.. బడుగు, పేదల బతుకును చిద్రం చేసిందని లేఖలో ఆరోపించారు. ప్రభుత్వం బేషజాలను వదిలి.. ఇలాంటి సంక్షుభిత సమయాల్లో దేశంలోని నిపుణుల సలహాలు స్వీకరించాలన్నారు. ఇది మరో పెద్దనోట్ల రద్దు తరహా డిజాస్టర్‌గా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

లాక్‌ డౌన్ విషయంలో మీ విజన్ విఫలమైంది. ఈ విషయం  చెప్పడానికి నేను విచారిస్తున్నానంటూ మక్కల్‌నీది మయ్యం అధినేత కమల్ హాసన్... ప్రధానమంత్రి మోడీకి బహిరంగలేఖ రాశారు. కరోనా వ్యాప్తి నిరోధానికంటూ 21 రోజుల లాక్‌డౌన్ విధించడంలో మోడీ అనుసరించిన విధానాలు.. లోపరహిత ప్లానింగ్‌కు నిదర్శనమన్నారు. లాక్‌డౌన్‌ను అకస్మాత్తుగా విధించి.. తిరిగి సామాన్యుడిని నిందించడం ఏంటని కమల్‌ ప్రశ్నించారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలో  దేశవ్యాప్తంగా 1.4 బిలియన్ ప్రజల్ని లాక్‌ డౌన్ చేశారన్నారు. నాలుగు గంటల సమయానికి బదులు...నాలుగు నెలల నోటీసివ్వాల్సిందన్నారు. పెద్దనోట్ల రద్దు మిగిల్చిన దాని కన్నా పెద్ద మిస్టేక్‌గా మారుతుందేమోనన్న భయం కలుగుతోందన్నారు కమల్.

 

ఇదే అంశంపై మార్చి 23న ప్రధాని మోడీకీ.. తొలి లేఖ రాశారు కమల్. లాక్ డౌన్ విధించేందుకు ఒక్కరోజు ముందు... కమల్, కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  పేదలు, బడుగు, బలహీన వర్గాలు వైరస్‌ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వం బాల్కనీకే పరిమితమైన ప్రభుత్వం కాదనుకుంటున్నానని... బాల్కనీ పెద్దమనుషులు, సమాజంలో అధికశాతం ఉన్న పేదలను పట్టించుకోరని కమల్‌ విమర్శించారు. మధ్యతరగతి ప్రజలు తమ సన్నాహాల్లో తాముంటారని... ఇక బాల్కనీ వర్గం. వారి విలాసవంతమైన జీవితానికి బాటలు వేసుకుంటుందని... లాక్‌డౌన్‌ లాంటి చర్యలు కేవలం అట్టడుగున ఉన్నవారి జీవితాలను ఇక్కట్లు పాలు చేస్తాయని చరిత్ర ఎప్పటి నుంచో చెబుతుందన్నారు... కమల్‌.

 

కోవిడ్ -19.. ఎక్కువ మందిని బాధితులుగా చేస్తుంది.  కానీ మనం పేదలను.. ఆకలి, కుంగుబాటు లాంటి వాటికి గురి చేస్తున్నాం. H.E.D 20 చూసేందుకు చిన్నగా ఉన్నా.. దీని ఫలితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. కోవిడ్ పోయినా కూడా దీని ఫలితాలు మాత్రం చాలా కాలం వెన్నాడుతాయి. రేపటి భారతం గురించి కృషి చేసే వారి ఆలోచనలు స్వీకరించాలి.  నేను విచారిస్తున్నాను.. మీకు ఇంటలెక్చువల్ అన్న పదం పడదు.  కానీ నేను అలాంటి తొలి ఇంటలెక్చువల్స్ అయిన పెరియార్, గాంధీ అడుగు జాడల్లో నడుస్తున్న వాడినని లేఖలో పేర్కొన్నారు కమల్.

 

ఈ వ్యవస్థ.. ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో విఫలమైందన్నారు కమల్. నిర్లక్ష్యం, అజ్ఞానంతో ఉన్న వాళ్లు.. దీన్ని దేశం నలుమూలల వ్యాపింపచేశారని మండిపడ్డారు. సర్.. దయచేసి మీ బౌండరీలను దాటి ముందుకు రండి. దేశం నలుమూలల నుంచి వస్తున్న సలహాలు స్వీకరించండి. మనకున్న అతిముఖ్యమైన బలం.. మానవ వనరులు. గతంలో ఇలాంటి సవాళ్లను అధిగమించాం. ఇప్పుడు కూడా అలాగే చేయవచ్చు. మీ పనులపై కోపం వస్తున్నా.. ఇప్పటికీ మీ సైడే ఉన్నా అంటూ లేఖను ముగించారు కమల్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: