దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేసులు ఐదు వేలకు చేరువవడంతో కొత్త కేసులు నమోదు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 74కు పెరగడం... ఇంకా 70 మంది బాధితుల రిపోర్టులు అందాల్సి ఉండటంతో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకూ నమోదైన 74 కేసులకు ఢిల్లీ మత ప్రార్థనలతో ఏదో ఒక విధంగా సంబంధాలు ఉన్నాయని సమాచారం. జిల్లాలో కేసులు భారీ సంఖ్యలో నమోదు కావడానికి మర్కజ్ ప్రార్థనలే కారణమని చెప్పవచ్చు.
 
జిల్లాలో కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 19 కేసులు నమోదు కాగా నంద్యాల మున్సిపాలిటీలో 18 కేసులు, ఆత్మకూరు మున్సిపాలిటీలో 4 కేసులు, నందికొట్కూర్ మున్సిపాలిటీలో 3 కేసులు, డోన్ మున్సిపాలిటీలో ఒక కేసు, బేతంచర్లలో ఒక కేసు, బనగానపల్లె డివిజన్ లో 4 కేసులు, పాణ్యం డివిజన్ లో 4 కేసులు, కోడుమూరులో 3, చాగలమర్రిలో 2, గడివేములలో 2, శిరివెళ్లలో 2, నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో 5 కేసులు నమోదయ్యాయి. 
 
కర్నూల్ చుట్టుపక్కల గ్రామాలలో ఒక కేసు, నందికొట్కూర్ 1, ఓర్వకల్ 1, అవుకు 1, రుద్రవరం 1, సంజామలలో ఒక కేసు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ప్రభుత్వం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో ప్రతిరోజు సర్వే నిర్వహించి అనుమానితులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు కేంద్రం దేశవ్యాప్తంగా రోజుకు లక్ష మందికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా గుంటూరులో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 304కి పెరిగింది. ఈరోజు కరోనా భారీన పడి కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: