ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా ఎఫెక్ట్ భారీగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఏనాడూ నొరు తెరిచి అడ‌గ‌ని సీఎం జ‌గ‌న్ కూడా ఆర్థిక సాయం చేయాలంటూ.. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. దీంతో వ్యాపార దిగ్గ‌జాల నుంచి సినీ ప్ర‌ముఖుల వ‌ర‌కు అంద‌రూ కూడా జ‌గ‌న్ పిలుపుతో స్పందిస్తున్నారు. త‌మ త‌మ ప‌ద్ధ‌తిలో సాయం ప్ర‌క‌టిస్తున్నారు. నిజానికి ఉప్పు-నిప్పుగా ఉండే చంద్ర బాబు-జ‌గ‌న్‌ల విష‌యంలోనూ క‌రోనా నేప‌థ్యంలో సాయం చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. త‌న హెరిటేజ్ సంస్థ త‌ర‌ఫున చంద్ర‌బాబు ఇప్ప టికే రాష్ట్రానికి సాయం చేయించారు. ఇక‌, త‌న ఎమ్మెల్యేల వేతనం విరాళంగా ఇచ్చారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా పార్టీల‌కు అతీతంగా త‌న ఎంపీ లాడ్స్ నుంచి 2.5 కోట్ల‌ను ఇచ్చారు.

 

అదేస‌మ‌యంలో త‌మ అమ‌ర‌రాజా బ్యాట‌రీ కంపెనీ నుంచి మ‌రో మూడు కోట్లు, ఉద్యోగుల జీతాల నుంచి 50 ల‌క్ష‌లు క‌లిపి మొత్తంగా ఆరు కోట్లు సీఎం స‌హాయ నిధికి అందిస్తూనేచిత్తూరులోవినియోగించాల‌ని కోరారు. ఇక‌, జ‌గ‌న్ అంటే నిత్యం మండిప‌డే.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా కోటి రూపాయ‌లు ఇచ్చారు. మ‌రి ఇంత‌గా ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ఎంపీలు కూడా సాయం చేస్తుంటే.. వైసీపీ ఎంపీలు మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంత ఇచ్చాం అని చెప్ప‌లేదు. స‌రే! కుడిచేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియ‌కుండా తాము ఇస్తున్నామ‌ని అనుకున్నా.. ప్ర‌భుత్వం వెల్ల‌డించిన వివ‌రాల్లోనూ వైసీపీ ఎంపీల ప్ర‌స్థావ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

 

గుంటూరుకు చెందిన గ‌ల్లా జ‌య‌దేవ్ ఇచ్చిన‌ప్పుడు ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ ఎంపీ ఇవ్వ‌లేద‌నే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అదేస‌మ‌యంలో బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ ఇల్లు విడిచి బ‌య‌టకు రాలేదు. ఇక‌, వైసీపీ ప్రధాన కార్య‌ద‌ర్శి, విజ‌య‌సాయి రెడ్డి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఇంత ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌లేదు. మ‌హిళా ఎంపీలు కూడా మౌనం పాటించారు. ఇక‌, రాజ్య‌స‌భ స‌భ్యులు, వ్యాపార వేత్త‌లు కూడా నిధులు ఇవ్వ‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు రాలేదు. దీంతో వైసీపీ ఎంపీలు ఎందుకు ఇంత మౌనం వ‌హిస్తున్నార‌నే సందేహాలు, ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరంతా ఏదైనా ప్ర‌త్యేక ఉద్దేశంతో ఉంటే.. దానినైనా చెబితే.. ఇప్పుడు విమ‌ర్శ‌లు ఉండ‌వు క‌దా! అంటున్నారు. మ‌రి ఎంపీలూ.. ఇప్ప‌టికైనా స్పందించండి ప్లీజ్‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: