కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులంటేనే ప్రజలు గడగడా వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రాణాంతక వ్యాధి నిమిషాల్లోనే ఇతరులకు సోకుతుంది. తుమ్మినా, దగ్గినా వైరస్ వెంటనే ఇతరులకు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి కరోనా బాధితులను ఐసొలేషన్ వార్డ్ లలో ఉంచి... ఎన్నో రక్షణ వస్తువులను ధరించి చికిత్స అందిస్తుంటారు డాక్టర్లు. కేవలం ఒకే ఒక్క కోవిడ్ 19 రోగితో 50 వేల మందికి కరోనా వైరస్ సోకిన సంఘటన చోటు చేసుకొని ప్రాణ నష్టంతో పాటు కొన్ని కోట్ల ఆస్తి నష్టాన్ని ఓ దేశానికి తెచ్చిపెట్టిందంటే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.


అదే ఒకవేళ ఎవరైనా కరోనా వైరస్ సోకిన వారు ఇతరులకు ఉద్దేశపూర్వకంగా ఆ వైరస్ ని వ్యాప్తి చేశారనుకోండి... ఫలితం జరిగే ఆస్తి, ప్రాణ నష్టం తలుచుకుంటే ఏ ప్రభుత్వ యంత్రాంగానికైనా చిర్రెత్తుకొస్తుంది. తాజాగా అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఓ యువతి తనకి కరోనా వైరస్ సోకిందని... తనకు సోకిన వైరస్ ని మీ అందరికీ వ్యాప్తి చేస్తానంటూ కారులో బయలుదేరుతూ ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. స్నాప్ చాట్ అనే వీడియో కాలింగ్ యాప్ లో ఈమె ఓ సూపర్ మార్కెట్ కి తుమ్ముతూ తగ్గుతూ వెళ్తున్న ఓ వీడియో గత కొన్ని గంటలుగా నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. పలువురు నెటిజనులు ఈ వీడియోని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా... తక్షణమే స్పందించిన టెక్సాస్ పోలీసులు ఆమె ఎవరో కనిపెట్టారు కానీ ఇప్పటి వరకు ఆమె ఆచూకీ దొరకలేదు.


పద్దెనిమిదేళ్ల లోరైన్ మారడియాగా అనే యువతి లైవ్ వీడియో లో మాట్లాడుతూ... 'నేను ఓ వాల్మార్ట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరికీ నేను కరోనా వైరస్ అంటించబోతున్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దన్నారు. అయినా వాళ్ళు ఎవరు నాకు చెప్పడానికి?! వాళ్ల మాట నేను అస్సలు వినను. మీలో ఎవరికైనా కరోనా వైరస్ రావాలని, చనిపోవాలని అనిపిస్తే నాకు తెలియజేయండి. నేను వెంటనే మీ దగ్గరకు వచ్చి కరోనా వైరస్ అంటించేస్తా' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆమె వలన సమాజంలోని ఇతర ప్రజలకు హాని జరుగుతుందని భావించిన చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమె సోషల్ మీడియా వీడియో లపై ఓ కన్నేసి ఆమెని పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ లోరైన్ కు నిజంగానే కరోనా వైరస్ సోకి ఉండి కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని నిర్ధారణ అయితే ఆమెకు కఠినమైన జైలు శిక్ష తప్పకుండా పడుతుందని పలువురు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: