కరోనా లాక్‌ డౌన్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది..! ఆర్ధిక వ్యవస్థలు షేక్ అయిపోతున్నాయి...! మనదేశంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులు కనిపించడం లేదు..! జూన్‌ వరకు పొడిగించాలని అంతర్జాతీయ సంస్థలు సలహాలు కూడా ఇస్తున్నాయి. అదే జరిగితే.. మన ఎకానమీ పరిస్థితేంటి..? మరికొన్ని వారాల పాటు దేశం మూతపడితే ఆ సంక్షోభాన్ని తట్టుకోగలమా..? వివిధ రంగాలపై ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది...? మరో పెద్ద మాంద్యాన్ని చూడాల్సి వస్తుందా ?

 

ప్రపంచంపై కరోనా విసిరిన సవాల్ సమాన్యమైనది కాదు. ఓ వైపు మనిషి ప్రాణాలను తోడేస్తున్న ఆరోగ్య సంక్షోభం.. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థలు.. భవిష్యత్తునే ప్రశ్నార్ధకంగా మార్చేసిన విషమ పరిస్థితి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ముందుగా మార్చి 31 వరకే అనుకున్నా.. కరోనా తీవ్రత దృష్టా ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. దీంతో యావత్ దేశం ఇళ్లకే పరిమితమైపోయింది. ప్రజల కదలికలపైనా ఆంక్షలు. అత్యవసర సేవలు మినహా...దేశంలో అన్ని రంగాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ పొడిగిస్తే  ఎకానమీ పరిస్థితి ఏంటన్న ప్రశ్న అందర్నీ వేధిస్తోంది.

 

రోడ్‌సైడ్ బిజినెస్‌ల నుంచి వందల కోట్ల వ్యాపారాలు చేసే సంస్థల వరకు  లాక్‌డౌన్ కారణంగా తీవ్ర నష్టాన్ని చూస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభాలైన అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్స్ , ఎంటర్‌టైన్మెంట్ రంగాల పరిస్థితి దారుణంగా తయారైంది. వ్యాపార వాణిజ్యాలు నిలిచిపోవడం దేశ ఆర్ధిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తోంది. బడ్డీకొట్లు మొదలుకుని.. మల్టీనేషనల్‌ కంపెనీలను నిలువునా ముంచేసింది కరోనా రక్కసి. రోజుకు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. కొన్ని ఇండస్ట్రీలను కోలుకోలేనంత దెబ్బకొట్టింది. నష్టాలను పూడ్చుకోలేక... కంపెనీలను నడపలేక... ఉద్యోగాల కోతే లక్ష్యంగా పెట్టుకున్నాయి వేలాది కంపెనీలు. ఆ ఇండస్ట్రీ... ఈ రంగం అనే తేడానే లేదు. ఉద్యోగాల కోతే ప్రధానాస్త్రంగా మారింది.

 

లాక్‌డౌన్‌తో షాపింగ్‌ మాల్స్‌, రిటైల్‌ దుకాణాలు మూతపడ్డాయి. ఆదాయం భారీగా క్షీణించింది. రానున్న రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు కోత ఖాయమంటోంది రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఏకంగా 136 మిలియన్ల ఉద్యోగాలు కోత పడే ప్రమాదముంటుందంటున్నారు. ప్రతీ మూడు ఔట్‌లెట్స్లో ఒకటి మూతపడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. భారత్‌లో 15 లక్షలకుపైగా ఉన్న ఆధునిక రిటైల్‌ దుకాణాల ద్వారా...సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వీటిద్వారా 60 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. లాక్‌డౌన్‌తో వీరంతా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ముంచుకొచ్చింది. 

 

కరోనాను తక్షణమే నియంత్రించలేకపోతే... సుమారు రెండున్నర కోట్ల ఉద్యోగాలు ఊడే ప్రమాదం కనిపిస్తోంది. 1930 నాటి ఆర్థికమాంద్యం పరిస్థితులు తలెత్తనున్నాయని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఐటీ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగాల కోత పడనుంది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ CII సైతం ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని చెబుతోంది.  గతం వారం 200లకు పైగా సంస్థల సీఈవోలతో ఒక సర్వే నిర్వహించింది CII. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని 52 శాతం మంది సీఈవోలు చెప్పారు. తక్కువలో తక్కువగా 15 శాతం ఉద్యోగాల్లో కోత ఉంటుందని 42 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారని అధ్యయనంలో వెల్లడించారు.  


ఇక నిర్మాణ రంగం కూడా తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తోంది. దేశ వ్యాప్తంగా నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికుల నుంచి వ్యాపారుల వరకు నష్టాలు చూస్తున్నారు. సినీ పరిశ్రమ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. షూటింగులు నిలిచిపోయాయి.. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సినీ కార్మికుల నుంచి సినీ వ్యాపార వర్గాల వరకు అందరి జీవితాలను కరోనా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్కటేంటి దాదాపు అన్ని రంగాలు ఇదే సంక్షోభాన్ని చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టి నిధులను సమకూర్చుంటున్నాయి. ఆహారోత్పతులపై కూడా ఈ ప్రభావం పడితే... ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదముందనన్న వాదనలున్నాయి. లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాల పాటు పొడిగిస్తే... దేశం మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: