కరోనా వైరస్ కారణంగా దేశం లో  ఆర్ధిక సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొనడం తో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి . కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే . దీనితో ప్రభుత్వ ఖజానాకు రాబడి తగ్గిపోయింది . మార్చి చివరి వారం , ఏప్రిల్ మొదటి వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లో   కనీసం పది శాతం  ఆదాయం కూడా రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహాటంగానే చెప్పుకొచ్చారు .  ఆదాయ రాబడి తగ్గడం తో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు    పొదుపు చర్యలను చేపట్టాయి .

 

తెలంగాణ వంటి ధనిక రాష్ట్రం    తమ ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా , ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని  నిర్ణయించింది . అదే సమయం లో మంత్రులు , ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల చైర్మన్లు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల జీతాల్లోనూ కోత విధించింది . ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు దశల్లో వేతనాలను అందజేయాలని నిర్ణయించింది . అంతేకాకుండా ప్రభుత్వ సలహాదారుల సేవలను ఉపసంహరించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది . జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చిన తరువాత 38 మంది   ప్రభుత్వ సలహాదారులను నియమించింది .

 

వీరిలో ఒకొక్కరికి మూడు నుంచి నాలుగేసి లక్షల వరకు జీతాలు చెల్లిస్తున్నారు . ఇక వారి సిబ్బంది , కార్యాలయ ఖర్చు అదనం . ప్రస్తుత పరిస్థితుల్లో  సలహాదారుల్ని కొనసాగించడం కంటే ఉపసంహరించుకోవడమే బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది .  ఎయిమ్స్ లో డాక్టర్ గా పని చేసిన శ్రీనాథ్ రెడ్డి ఎలాంటి జీతభత్యాలు ఆశించకపోవడంతో ఇటీవల ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం   వైద్య సలహాదారు గా నియమించింది .

 

ఇదే తరహాలో మిగతా ప్రభుత్వ సలహాదారుల సేవలని పొందాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ భావిస్తోంది . ప్రస్తుత కష్టకాలం లో ఇంతకంటే మరొక మార్గం లేదని , లేనిపక్షం లో ప్రభుత్వ సలహాదారుల్ని తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది .   

మరింత సమాచారం తెలుసుకోండి: