ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న ప్రాంతాల్లో విశాఖపట్నం ఒక‌టి. ఈ న‌గ‌రంలో క‌రోనా విస్తృతి ఎక్కువ‌గా ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాష్ర్ట టూరిజం శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇచ్చారు. కరోనా నియంత్రణ అంశంలో ట్రీట్ మెంట్,క్వారంటైన్ ,వైద్యపరీక్షల విషయంలో పూర్తి స్దాయిలో అధికారులు సంసిధ్దులై ఉన్నారని, ప్రజలు వాటి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు.

 


``విశాఖ అనేది కీలకమైన నగరం. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. విశాఖ‌లో 20 కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీలు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి వైద్యసిబ్బందితో పాటు కరోనా నియంత్రణకు పాటుపడుతున్న ప్రతి ఉద్యోగికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ర్టంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. పేదలకు 1.80 లక్షల మందికి ఇళ్లస్దలాలు ఇవ్వాలని నిర్ణయించాం. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. రోటి, కపడా, మకాన్ ఈ విధంగా మూడు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు.`` అని తెలిపారు.

 

జిల్లా అంతటా 145 రైతుబజార్లు పెట్టారని మంత్రి అవంతి వెల్ల‌డించారు. ``ఇదివరకటి లాగానే పండ్లు పాలు నిత్యావసరాలు విక్రయించుకోవచ్చు. ఎక్కడా కూడా రేట్లు మాత్రం పెరగకూడదు. రైతులకు ఇబ్బంది ఉండకూడదు. 1902 కు ఫిర్యాదులు వచ్చాయి.95 శాతం ఫిర్యాదులు పరిష్కరించాం. ఇదే కాకుండా రేషన్ కూడా ఇచ్చాం. ప్రతిపక్ష నేత అది కూడా దుష్ర్పచారం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చింది 500. రాష్ర్ట ప్రభుత్వం వేయి రూపాయలు ఇస్తోంది. అది కూడా 90 శాతం పేదలకు ఇప్పటికే అందింది. మిగిలినవారికి కూడా అందిస్తాం. జిల్లాలో 90 శాతం రేషన్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు లేని వారికి కూడా విజయనగరం ,విశాఖలో 50 వేలమందికి ఇవ్వడం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి 7,500 మందికి వారి ట్రస్ట్ ద్వారా రేషన్ ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా స్వచ్చంద సంస్దలు, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నాం. ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దు. జివిఎంసి ఆద్వర్యంలో షెల్టర్ల ఏర్పాటు ద్వారా అనాధలకి, బిక్షువుల‌కి ఆశ్రయం కల్పించి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సాయంతో పాటు స్వచ్చంద సేవా సంస్ధలు సైతం ముందుకు వస్తున్నాయి`` అని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: