భారత్ ప్రపంచంలోనే భిన్నమైన దేశం. అంతే కాదు ప్రాచీనమైన దేశం. దేవుళ్ళు అందరూ పుట్టిన దేశం. ఇక్కడ భిన్న మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు, ఎన్నో కులాలు ఇలా ఇక్కడే  అన్నీ ఉన్నాయి. ఇటువంటి దేశం మొత్తం విశ్వంలో ఎక్కడ చూసినా కనిపించదు. కానీ ఒక్కటే భారత్ బలం. అదేంటి అంటే ఎంత భిన్నత్వం ఉన్నా కష్టకాలంలో కలసిపోవడం, ఒక్కటిగా నిలబడడం భారత్ కే చెల్లు.

 

ఇపుడు అదే భారత్ కి శ్రీరామ రక్ష కావాలని అంతా ఆశిస్తున్నారు. భారత్ గురించి ఇతర దేశాలో ఉన్న భారతీయులే కాదు, వివిధ రంగాల్లో ఉన్న నిపుణులు కూడా ఆందోళన పడుతున్నారు. కేవలం ఆరు కోట్ల మంది మాత్రమే జనాభా ఉండి అన్ని రకాలైన సదుపాయాలు, ఉత్తమ వైద్య సేవలు, తలసరి ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉండే ఇటలీ కరోనా వైరస్ కి చిగురుటాకులా వణికిపోయింది.

 

భారత్ లాంటి పేద దేశం, పెద్ద దేశం అటువంటి పరిస్థితి వస్తే ప్రపంచానికే అది భూకంపం వచ్చినట్లుగా ఉంటుందనడంలో సందేహం లేదు. భారత్ విషయంలో వైద్య రంగ నిపుణులు ఇపుడు కలవరపడుతున్నది ఒకే ఒక్క విషయంలో అందరూ కలసి ఉంటారు. అంతా ఒక్కటిగా ఉండడం భారతీయ స్వభావం. 

 

కరోనా మహమ్మారికి అదే బలాన్ని ఇస్తుందని అంటున్నారు. మనకు ఉన్న భూభాగంలో ఎక్కువ మంది జనాభా ఉండడం సహజం. ఒక ఇంటి చూరులో పది మంది అతి సునాయాసంగా కలసి జీవించగలరు. ఇపుడు అలా అసలు కూడదు, ప్రతి మనిషి ఎడం పాటించాలి. అలాగే ఇంటికే పరిమితం కావాలి. ఎనభై శాతం పేదలు ఉన్న ఈ దేశంలో అది అసాధ్యం. కానీ అది సుసాధ్యం చేసినపుడే భారత్ కరోనా వైరస్ ని తరిమికొట్టగలదు.

 

వైద్యులంతా ఇపుడు ఒక్కటే ప్రార్ధిస్తున్నారు. భారతీయులు తనదైన రోగ నిరోధక శక్తితో కరోనా వైరస్ సోకకుండా బయటపడాలని, అదే విధంగా ఇంటికే పరిమితం కావాలని శతకోటి దేవుళ్ళకు మొక్కుతున్నారు. అదే కనుక జరగకపోతే మాత్రం భారత్ లో పెను విస్పోటనం తప్పదని భారతీయ వైద్య నిపుణులు ఆందోళన పడుతున్నారు. మనకున్న ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు కూడా అసలు సరిపోవు. అందువల్ల భారత్ భద్రంగా ఉండాలి, మహమ్మారిని జయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాల రేటు ఉన్నచోటే నిలిచి ఉండాలి. ఇటలీ లాంటి పరిస్థితి రాకూడదు అని. అంతా ఇపుడు  అదే కోరాలి. దేవుళ్ళను కూడా వేడుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: