కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్  విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి పై రాష్ట్రాలు ఒత్తిడి పెంచేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన మూడు వారాల లాక్ డౌన్ ఈనెల 14వ తేదీన ముగుస్తుంది. నిజానికి లాక్ డౌన్ కారణంగా యావత్ దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా తమ ఇబ్బందులను సహిస్తునే లాక్  డౌన్ కు సహకరిస్తున్నారంటే కేవలం ప్రాణభయమే కారణమని చెప్పాలి. ఈ సమయంలోనే లాక్ డౌన్ ను మరింత పొడిగించాలని కేసియార్ బహిరంగంగానే ప్రధానికి చేసిన అప్పీల్ కు ఇతర రాష్ట్రాల నుండి మద్దతు పెరుగుతోంది. బాధితుల కేసులు పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.

 

నిజానికి ప్రధానమంత్రి ప్రకటించిన  మూడు వారల లాక్ డౌన్ కు వైరస్ ను నియంత్రించటమే ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఢిల్లీలో పోయిన నెలలో జరిగిన మత ప్రార్ధనలకు వివిధ రాష్ట్రాల నుండి వేలసంఖ్యలో హాజరయ్యారు.  తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన వాళ్ళలో కొందరి ద్వారా వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఈ కారణంగానే దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏపి, తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరిగిపోతున్నాయి.

 

పెరిగిపోతున్న కేసులను చూసిన తర్వాతే పై రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ను పొడిగించాల్సిందే అంటున్నారు.  లాక్ డౌన్ అమల్లో ఉన్నపుడే  కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఇటువంటి సమయంలో లాక్ డౌన్ ఎత్తేసినా, పాక్షికంగా సడలించినా కేసులు మరింతగా పెరిగిపోతాయని చాలా మంది ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్ డౌన్ విషయంలో ప్రధానమంత్రి ఏమి చేస్తారనే విషయంలో ఎవరికీ సరైన సమాచారం లేదు.  లాక్ డౌన్ ఎత్తేస్తారని ఒకవైపు లేదు లేదు పాక్షికంగా సడలిస్తారని మరోవైపు జరుగుతున్న ప్రచారంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.

 

మొత్తం మీద పెరుగుతున్న కేసుల తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించాల్సిందే అంటూ సామాన్య జనాలు అభిప్రాయపడుతున్నారు.  ఎందుకంటే చాలా ఊర్లలో ఎవరిళ్ళల్లో వాళ్ళున్నపుడే  కరోనా వైరస్ భూతం వెంటాడుతోంది. కాబట్టి ప్రజల ఆలోచనే కాకుండా ముఖ్యమంత్రుల ఆలోచన కూడా దాదాపు ఒకేలాగ ఉంది కాబట్టే ప్రధానమంత్రి కూడా లాక్ డౌన్ పొడిగింపుకే నిర్ణయం తీసుకుంటారని మెజారిటి  ఆశిస్తున్నారు.  బహుశా ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లోనే ప్రధాని నుండి ఓ ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. చూద్దాం మోడి ఏం చేస్తారో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: