దేశంలో కరోనా కేసుల సంఖ్య ఐదు వేలకు చేరువైంది. అయితే కొన్ని విదేశాలతో పోలిస్తే ఇది

పెద్ద సంఖ్యేమీ కాదు. కానీ ఇండియాకు ఉన్న వైద్య పరిమితులకు జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది. అయితే ఇండియాలో అన్నింటి కంటే ఎక్కువగా మహారాష్ట్ర పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది. దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో ఐదో వంతు ఈ రాష్ట్రంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

 

 

దేశవ్యాప్తంగా దాదాపు ఐదువేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే.. మహారాష్ట్రలోనే ఆ సంఖ్య వెయ్యి దాటినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నింటి కంటే భయపెడుతున్నదేంటంటే.. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ధారవిలో కరోనా ప్రబలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ ఘటన అనంతరం రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది.

 

 

మహారాష్ట్రలో గత 24గంటల్లో 110 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ధారావిలో మొదట వైరస్‌ సోకి మరణించిన వ్యక్తినుంచి అతని తండ్రి, సోదరునికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరికి సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తిస్తున్నారు. ఇప్పటికే ధారావి ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7కు చేరుకుంది.

 

 

అంతే కాదు.. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన 10మంది తబ్లిగీ సభ్యులు ధారావిలో కొన్నిరోజులపాటు గడిపినట్లు తెలిసింది. ధారావిలో కరోనాతో మరణించిన తొలివ్యక్తి ఇంటిలోనే వీరు ఉన్నారు. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ఈ పదిమంది నుంచే ధారావి ప్రాంత వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ధారావిలో కరోనా ప్రబలితే ఇక కట్టడి చేయడం చాలా కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రకు ఇది చాలా కీలక సమయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: