భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కేంద్ర రాష్ట్ర  ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దాదాపుగా అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు ఇందులో పాల్గొంటున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డికి భార‌త్ ఆర్మీ కూడా రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. దాదాపు ఆర్మీకి చెందిన 28 ఆస్ప‌త్రులను క‌రోనా వైద్య‌సేవ‌ల‌కు కేటాయించారు. అలాగే.. భార‌త రైల్వే శాఖ కూడా క‌రోనా క‌ట్ట‌డికి ముంద‌డుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్ల‌లోని క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి త‌న‌వంతు కృషి చేస్తోంది. భార‌తీయ రైల్వే దాదాపు 2500 కోచ్‌ల్లో.. సుమారు 40 వేల ఐసోలేష‌న్ బెడ్‌ల‌ను త‌యారీ చేసింది. ప్ర‌తి రోజూ రైల్వేశాఖ 375 ఐసోలేష‌న్ బెడ్ల‌ను త‌యారీ చేస్తున్న‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొత్తం 133 లొకేష‌న్ల‌లో ఈ ప‌ని జ‌రుగుతోంద‌ని చెబుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఇక భార‌త్‌లో మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు 4789 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 124మంది మ‌ర‌ణించారు. 353మంది కోలుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

 ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా ఏడు వేలమందికిపైగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఐసీఎంఆర్ ఎపిడ‌మాల‌జీ అధిప‌తి గంగాఖేద్క‌ర్‌  తెలిపారు.  136 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు ప‌రీక్ష‌లు చేప‌డుతున్నాయ‌ని, 59 ప్రైవేటు ల్యాబ్‌లు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. భార‌త్‌లో రోజురోజుకూ పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల దృష్య్టా ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స్వీయ‌నియంత్ర‌ణ‌తో సామాజిక దూరం పాటించి, క‌రోనా మ‌హ‌మ్మారికి త‌రిమికొట్టాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఇక ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేయ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంత కాలం లాక్‌డౌన్‌ను కొన‌సాగించే అవ‌కాశాలే ఉన్నాయ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైర‌స్‌కు మందుగానీ. వ్యాక్సిన్‌గానీ లేక‌పోవ‌డం వ‌ల్ల లాక్‌డౌన్‌ను పాటించ‌డ‌మే మేల‌ని అంటున్నారు.  ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 81200మంది మ‌ర‌ణించారు. 14ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా వైర‌స్ సోకింది. సుమారు మూడు ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా నుంచి కోలుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: