ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కరోనా కట్టడి కోసం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం కరోనాను ఎదుర్కొనేందుకు భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేశారు. సీఎం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా బాధితులకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ మందులు, బెడ్లు, టెస్టింగ్ పరికరాలు, సిబ్బంది కొరత లేకుండా ఏర్పాట్లు చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం కరోనా బాధితులకు చికిత్స చేసే సిబ్బంది వారం రోజులు పని చేస్తే 14 రోజులు సెలవు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 4 కరోనా ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో పాటు ప్రతి జిల్లాలో కొన్ని ఆస్పత్రులను కరోనా బాధితులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 284 ఐసీయూ, 1370 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయగా ప్రభుత్వం వీటికి అదనంగా రాష్ట్ర స్థాయిలో 444 ఐసీయూ బెడ్లు, 1680 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా నిన్న కేవలం 11 కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి నిన్న రాత్రి 9 గంటల వరకు కేవలం 11 కేసులు మాత్రమే నమోదైనట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 314కు చేరింది. 
 
నిన్న నమోదైన 11 కేసుల్లో గుంటూరు జిల్లాలోనే 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు కరోనా భారీన పడి మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కరోనా కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటికే మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారికి, వారి సన్నిహితులకు కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు కూడా వచ్చాయి. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చినట్లే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: