సామాన్యుల నుంచి మొద‌లు దేశాధినేత‌ల‌నే కాదు.. చివ‌రికి జంతులను కూడా క‌రోనా వైర‌స్ వ‌ద‌ల‌డం లేదు. కొవిడ్‌-19తో చిగురుటాకులా వ‌ణికిపోతున్న ప్ర‌పంచంలో ప‌లు చోట్ల ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. క‌రోనా బారి నుంచి కాపాడుకోవ‌డానికి ఎవ‌రికివారుగా అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నిత్యం చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాల‌ని, ముఖాన్ని చేతితో తాకొద్ద‌ని, ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌కుండా మాస్క్‌లు ధ‌రించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాకుండా.. ప్ర‌జ‌లు సామాజిక‌దూరంపాటించాల‌ని చెబుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి మాస్క్ ధ‌రిస్తేనే స‌రిపోద‌ని, సామాజిక దూరం కూడా పాటించాల‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌దేప‌దే చెబుతోంది. అయితే.. కొద్దిరోజులుగా క‌రోనా వైర‌స్ జంతువుల‌కు కూడా సోకుతుంద‌నే విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీలో ఓ పిల్లికి, అమెరికాలోని జూలో ఓ పులికి క‌రోనా సోకింది.

 

ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో కూడా అధికారులు అల‌ర్ట్ అయ్యారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న జూల‌లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. మ‌న జూల‌లోని జంతువులు ఎలా ఉన్నాయో నిత్యం గ‌మ‌నించాల‌ని, వాటిని చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఓ మేక‌ల పెంప‌కందారు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే త‌న మేక‌ల‌కు కూడా మాస్క్‌ల‌ను క‌ట్టాడు. అదేమిటీ.. మ‌నుషులు మాస్క్‌లు ధ‌రించ‌డం చూశాంగానీ.. మేక‌ల‌కు కూడా మాస్క్‌లు క‌ట్టారా.. అని ఆశ్చ‌ర్య‌పోకండి..  మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే..! తెలంగాణలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు తాను పెంచుతున్న మేకలకూ మాస్క్‌లు కట్టారు. అమెరికాలో ఒక పులికీ కరోనా సోకినట్లు తెలుసుకుని తన జీవాలకూ వైరస్‌ సోకకుండా ఇలా చేశానని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. మేక‌ల‌కు మాస్క్‌లు క‌ట్టి తీసుకెళ్తుంటే స్థానికులంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూశారు. ఈ ఫోటో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మాస్క్‌లు ఓకే గానీ.. మేక‌లు కూడా సామాజిక‌దూరం పాటిస్తే బాగుండున‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: