ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో లాక్ డౌన్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరు లాక్ డౌన్ ను పొడిగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే... మరికొందరు మాత్రం లాక్ డౌన్ ఎత్తివేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో లాక్ డౌన్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్రం లాక్ డౌన్ ను ఎత్తివేసినా కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేవరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తామని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ ను పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో మంత్రుల బృందం మే 15 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని సిఫార్సు చేసిందని సమాచారం. 
 
దేశంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఈ నెల 12న లేదా 13న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల్లో ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 
 
ఏపీలో ఈరోజు 15 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 40 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 404కు చేరింది. ఏపీలో కరోనా కొంత తగ్గుముఖం పట్టినా తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: