ప్రపంచ మానవాళి మేలు కోసం పనిచేయాల్సిన సంస్థలు కొన్ని దేశాలకు తొత్తులుగా మారితే ఏమవుతుందో తెలుసా...! అన్ని అధికారాలు ఉండి కూడా...ఏదో ఒక దేశం చెప్పినట్టు ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసా...! ఇప్పటికే ఆ సంక్షోభాన్ని అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి. చైనా జేబు సంస్థగా మారిపోయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ...WHO కోవిడ్ 19 విషయంలో ఘోర తప్పిదాలు చేసింది. ఐక్యరాజ్య సంస్థ అనుబంధ సంస్థగా దానికున్న  క్రెడిబిలిటీని కోల్పోయింది.

 

నాలుగైదు నెలల క్రితం వరకు కరోనా వైరస్ గురించి ప్రపంచానికి పెద్దగా ఏమీ తెలియదు. అదేదో చైనాకు మాత్రమే పరిమితమైన జబ్బని అందరూ అనుకున్నారు. వైరస్ తీవ్రత పెరిగిన తర్వాత కూడా చైనా దాని గురించి ప్రపంచానికి పెద్దగా ఏమీ చెప్పలేదు..అక్కడి డాక్టర్ల నోళ్లు కూడా నొక్కేశారు చైనా పాలకులు.  ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఆరోగ్య సమస్య అయితే దాని గురించి ఎవరూ పెద్దగా ఆందోళన చెందరు . కానీ రోజులు గడిచే సరికి కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. చైనాలో వుహాన్ అనే మహా నగరాన్ని కబళించే స్థాయికి చేరుకుంది. ఇలాంటి సమయాల్లో అసలు ఆ వైరస్ ఏంటి... దాని వల్ల పొంచి ఉన్న ముప్పు ఏంటి..? అది మహమ్మారిగా మారుతుందా లేదా.. అన్న విషయాలను గుర్తించి వాటిని ప్రపంచానికి తెలియ జేయాల్సిన బాధ్యత WHO లాంటి సంస్థకు ఉంటుంది... దీని పేరే ప్రపంచ ఆరోగ్య సంస్థ... ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే దీని పని...విధి...  కానీ WHO ఆ పని చేసిందా.... ? కరోనా విషయంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయగలిగిందా....? 

 

కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన మార్గదర్శకాలనే వేదవాక్కుగా అందరూ పాటిస్తూ వస్తున్నాం... అసలు కరోనా అంటే ఏంటి.. అది ఎలా వ్యాపిస్తుంది.. దాని లక్షణాలు ఏంటి...రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...ఇలా.. WHO ప్రజా చైతన్యం కోసం చాలా ప్రకటనలు చేస్తూ వచ్చింది... వాటినే మనం కూడా ఫాలో అవుతూ వస్తున్నాం...ఇవన్నీ చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా అనుకుంటాం...  కానీ లోతుల్లోకి వెళ్లి చూస్తే... కరోనా విషయంలో WHO ప్రపంచ మానవాళిని ఎంతటి సంక్షోభంలోకి నెట్టిందో అర్ధమవుతుంది. 

 

కరోనా అనే కంటికి కనిపించని ఓ చిన్న వైరస్... మహమ్మారిగా మారకుండా చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోరంగా విఫలమైంది... ఇంకా చెప్పాలంటే అసలు కరోనాను డీల్ చేయడంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధ రహస్య ఎజెండాతో పని చేసింది. చైనా చెప్పినట్టు ఆడుతూ... చైనాకు వంత పాడుతూ...చైనా పాలుకుల ఏది చెపితే... అదే నిజమన్నట్టు....మొత్తం చైనా పక్షపాతిగా మారిపోయింది ప్రపంచ ఆరోగ్య  సంస్థ. 

 

ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా  ప్రపంచ ఆరోగ్య సంస్థకు క్రెడిబిలిటీ ఉంటుంది. చైనాకు తొత్తుగా వ్యవహరించేందుకు దాన్ని పణంగా పెట్టేసింది WHO.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే మాట చెబుతున్నారు. అమెరికా నుంచి భారీగా నిధులు తీసుకుంటూ... అమెరికా ఇచ్చే నిధులతో మనుగడ సాధించే సంస్థ చైనాకు అనుకూలంగా మారిపోయిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఇకపై ఇచ్చే నిధులను కూడా నిలిపివేయాలన్న స్థాయిలో ట్రంప్‌...WHOపై ఆగ్రహంతో ఉన్నారు.

 

అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు కాబట్టి...ప్రపంచ ఆరోగ్య సంస్థపై వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు.. వాస్తవానికి  WHO ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుంది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి... గతేడాది డిసెంబర్ చివరి వారంలోనే చైనాలో కరోనా వైరస్ పుట్టింది. చైనా సహజంగానే దాన్ని తొక్కిపట్టింది. అయితే వూహాన్‌లో ఏదో జరుగుతుంది... ..అంతుపట్టని వైరస్‌తో ప్రజలు ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారన్న చర్చ అన్ని దేశాల్లో మొదలైంది. అప్పుడు తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది.

 

వుహాన్‌లో పుట్టిన వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అది ఇతర ప్రాంతాలకు వ్యాపించే  అవకాశాలు కూడా లేవని  WHO చెప్పుకొచ్చింది. ప్రపంచ ప్రజలంతా అది నిజమే అనుకుని నమ్మారు. గతంలో కూడా సార్స్ వంటి మహమ్మారి చైనాను వణికించింది కదా.. మళ్లీ అలాంటి రోగమే ఏదో వచ్చిందని భావించారు.. అయితే వుహాన్‌లో పరిస్థితి తీవ్రంగా మారుతున్న సమయంలోనూ కూడా
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతే కూల్‌గా స్పందించింది. కరోనా వైరస్ మానవుల నుంచి మానవులకు వ్యాపించదంటూ ఈ ఏడాది జనవరి 14న WHO ట్వీట్ చేసింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థే స్వయంగా ప్రకటిస్తే.. అందరూ అదే నిజమనుకున్నారు.... కానీ WHO ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే ప్రకటనలు చేస్తూ ప్రపంచాన్ని ఏమార్చేసింది.

 

రోజులు గడిచే కొద్దీ వూహాన్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. పదుల సంఖ్యలో మొదలైన కేసులు వందలు వేలకు వెళ్లిపోయాయి. చూస్తుండగానే వూహాన్ దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. మరణాలు కూడా పెరిగిపోయాయి. ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చిందని...అది మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుందని... జనవరి 20న చైనాకు చెందిన వైద్యుడే ప్రకటించాడు... పరిస్థితి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా WHO...కరోనాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. 

 

కరోనా వైరస్ మహమ్మారిగా మారి వూహన్ నగరాన్ని శవాలగుట్టగా మార్చేస్తుండటంతో చైనా జనవరి 23న వుహాన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించింది దాదాపు రెండు కోట్ల జనాభా ఉండే నగరానికి పూర్తిగా తాళం వేసింది. రాకపోకలపై ఆంక్షలు విధించింది. చైనాలోని ఇతర ప్రాంతాలకు పాకకుండా ఏర్పాట్లు చేసుకుంది. పోనీ అప్పుడైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర దేశాలకు నిజాలు చెప్పిందా అంటే అది కూడా జరగలేదు. జనవరి 28న...అంటే వుహాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన ఐదు రోజులకు WHO చీఫ్ టెడ్రోస్‌ చైనాకు అనుకూలంగా మాట్లాడారు. ఓ వైరస్‌ను చైనా గుర్తించిందని...దానిని కట్టడి చేసేందుకు ఆ దేశం తీవ్రంగా కృషి చేస్తుందంటూ ప్రశంసలు కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: