కరోనా వైరస్ విషయంలో WHO ప్రపంచాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించింది..! అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని కూడా పట్టించుకోకుండా చైనాకు ఎందుకు  వంత పాడింది...! ఇలా చేయడం ద్వారా ఎవరి ప్రయోజనాలను ఆ సంస్థ కాపాడింది..! నిష్పక్షపాతంగా అన్ని దేశాల కోసం పనిచేయాల్సిన ప్రపంచ స్థాయి సంస్థ... డ్రాగన్ కనుసన్నల్లోకి ఎందుకు వెళ్లిపోయింది. 

 

ప్రపంచంలో ఇవాళ ఏ ఒక్క దేశం కూడా ఆనందంతో లేదు. ఆర్ధికంగా శక్తివంతంగా ఉన్న అమెరికా లాంటి దేశాలు... ఏ సమస్యనైనా సమిష్టిగా ఎదుర్కొనే యూరోపియన్ యూనియన్ దేశాలు.. దాదాపుగా యావత్ ప్రపంచం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది.. ఈ సమస్యకు విరుగుడు ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానమే లేదు. కంటికి కనిపించని శత్రువు మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసింది. రేపనేది ఎలా ఉంటుందో తెలియని అయోమయ స్థితిని ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటుంది అంటే... దానికి కేవలం కరోనా వైరస్ ఒక్కటే కారణం కాదు...అది ఓ మహమ్మారిగా మారకుండా కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్యం కూడా కారణమే.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ విమర్శల సుడిగుండంలో చిక్కుకోవడానికి దానికి నాయకత్వం వహిస్తున్న వారు కూడా బాధ్యులే. ప్రస్తుతం WHO చీఫ్‌గా వ్యవహరిస్తున్నది మిస్టర్ టెడ్రాస్... ఈయనది ఇథియోఫియా. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని ఈయనపై ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. WHO అధ్యక్షుడిగా ఎన్నికవడానికంటే ముందు కూడా టెడ్రాస్‌పై ఎన్నో విమర్శలున్నాయి. 2017లో సొంత దేశం ఇథియోఫియాలో మూడు సార్లు కలరా మహమ్మారి ప్రబలితే ఆ విషయాన్ని దాచిపెట్టారు టెడ్రాస్. 

 

2017లో జరిగిన WHO ఎన్నికల్లో ఈయన చైనా మద్దతుతో డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. అమెరికా మద్దతున్నా సరే... ఈయన ప్రత్యర్ధి డాక్టర్ డేవిడ్ నబారో... డైరెక్టర్ జనరల్‌ గా గెలవలేకపోయారు. ఆ స్థాయిలో చైనా వ్యూహాలు రచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్న ఇతర దేశాల ఓట్లను టెడ్రాస్‌కు అనుకూలంగా మార్చుకుని... ఆయన్ను కీలక పదవిలో కూర్చోపెట్టింది. చైనా సహకారంతో  WHO  డైరెక్టర్ జనరల్ స్థాయికి ఎదిగిన టెడ్రాస్‌... ఆ దేశంపై తనకున్నభక్తిని చాటుకుంటూ వచ్చారు. నవంబర్ 17, 2019లో వుహాన్‌లో కరోనా వైరస్ పుడితే... 2020 మార్చి 20 వరకు దాన్ని మహమ్మారిగా ప్రకటించకుండా... టెడ్రాస్‌ పెద్ద తప్పు చేశారు.

 

చైనాలోని జంతు మార్కెట్ల నుంచి వైరస్ లు పుట్టే ప్రమాదముందని 2007లోనే ఓ పరిశోధన తేల్చింది. కరోనా వైరస్  మళ్లీ విజృంభించే ప్రమాదముందని అప్పుడే హెచ్చరించింది. అంతెందుకు 2018లో WHO అధికారికంగానే ఓ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో కొత్త వైరస్‌ ప్రపంచానికి సవాల్ విసరబోతోందని  ఆ నివేదికలో స్పష్టంగా ఉంది.  అంటే మానవాళిని అప్రమత్తం చేసే అవకాశమున్నా... ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే వెసులుబాటు ఉన్నా WHO నిమ్మకు నీరెత్తేలా వ్యవహరించింది. అలా ఉండకపోతే చైనాకు కోపమొస్తుంది కదా.

 

కరోనా ముప్పును గుర్తించి చైనాపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధిస్తే దానిని కూడా తప్పుపట్టింది WHO. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశమే లేదని.. ఆంక్షలు విధించడం ద్వారా దేశ మధ్య సంబంధాలు దెబ్బతింటాయంటూ ఉపన్యాసాలు ఇచ్చింది. WHO డైకెర్టర్ జనరల్ మాటలు విని... ట్రావెల్ బ్యాన్‌ను అమెరికా తొలగించి ఉంటే... కరోనాతో ఇప్పటికే ఆదేశం పూర్తిగా నాశనమైపోయి ఉండేది. 

 

ఐక్యరాజ్యసమితి లాంటి వ్యవస్థలను పోషించాల్సిన అవసరం ఏముందని ఈ మధ్య అమెరికా వాదిస్తోంది. అందుకే యూన్ అనుబంధ సంస్థలపై ఫోకస్ తగ్గించింది. దీనిని డ్రాగన్ కంట్రీ చైనా తనకు అనుకూలంగా మార్చుకుంది. WHO తో పాటు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలపై పట్టు సాధించే ప్రయత్నాలు చేసింది. సూపర్ పవర్‌గా ఎదిగే క్రమంలో ఇలాంటి సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. ప్రతిష్టాత్మక సంస్థలను తనకు అనుకూలంగా మార్చుకుని వాటి విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేసింది.

 

వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి నుంచి ఇదే వైఖరితో లేదు.. మానవాళి శ్రేయస్సు కోసం ఏర్పడిన WHO ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ప్రజల పక్షాన కూడా నిలబడింది. చైనాను నిలదీసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. 2002-2003 మధ్యలో సార్స్‌ మహమ్మారి చైనాను కుదివేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు WHO డైరెక్టర్ జనరల్‌గా నార్వే మాజీ ప్రధానమంత్రి గ్రో హర్లేమ్ ఉన్నారు. సార్స్‌ను కట్టడి చేయడంలో చైనా సరిగా స్పందించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. 
దీంతో అప్పుడు చైనా ఆరోగ్య మంత్రిని తొలగించాల్సి వచ్చింది. అదీ అప్పట్లో WHOకున్న క్రెడిబిలిటీ. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.  అప్పటి చైనా వేరు...ఇప్పటి చైనా వేరు.. ప్రపంచ దేశాల మధ్య గ్లోబల్ ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి. 

 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో సంక్షోభాలను చూసింది.అమెరికా , సోవియట్ యూనియన్ల మధ్య నలిగిపోయింది. కాపీ రైట్ ఇష్యూస్‌ కూడా WHOను వెంటాడాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చింది. మానవాళి శ్రేయస్సుకు అన్ని దేశాలు ప్రాధాన్యత ఇచ్చాయి. అందులో భాగంగా  సంస్కరణలను కూడా చేపట్టాయి. కానీ అవి సరిగా అమలు కాలేదు. 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సభ్య దేశాలు ప్రజల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తప్పు చేసే అధికారాన్ని కూడా WHOకు దఖలు పరిచారు. అవసరమనుకుంటే ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే పవర్స్‌ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకున్నాయి. కరోనా వైరస్ విషయంలో ఇవేమీ అమలు కాలేదు.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిపై అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా అసంతృప్తితోనే ఉన్నాయి. ట్రంప్ కాబట్టి....WHOతో తాడో పేడో తేల్చుకుంటానంటూ  మొహంమీదే చెప్పాశారు. మహమ్మారిని డీల్‌ చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి సరిగా లేదని.. ఇటీవల జీ 20 దేశాల సదస్సులో ప్రధానమంత్రి మోడీ కూడా ప్రస్తావించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: