అమెరికాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్య 13వేలు సమీపిస్తోంది. అమెరికా ఇలాంటి పరిస్థితిలో ఉండటంతో.. ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆయన విరుచుకుపడ్డారు. చైనాకు WHO వంతపాడుతోందని మండిపడ్డారు. 

 


అమెరికాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజు మినిమమ్ వెయ్యి మంది వరకూ చనిపోతున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశంలో.. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ.. కరోనా మరణమృదంగం ఆగడంలేదు. ముఖ్యంగా ఒక్క న్యూయార్క్ లోనే కరోనా కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవుతోంది. అమెరికాలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతుండడం ఆ దేశ ప్రజల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మృత్యుఘోష మాత్రం ఆగడంలేదు. దీంతో ట్రంప్.. తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి అంతటికి కారణం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు.

 


ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుంచి ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో దాని ప్రమాదంపై సంస్థ వద్ద సమాచారం ఉందని.. అయినా దాని గురించి ప్రపంచానికి తెలియజేయలేదని ఫైర్ అయ్యారు.  కరోనా మహమ్మారి విషయంలో చాలా తప్పటడుగులు వేసిందని విమర్శించారు. చైనాలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్‌ఓ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఇది అతిపెద్ద తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

 


ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుంచి భారీగా నిధులు వస్తుంటాయి. సగటున 58 మిలియన్  డాలర్లు WHOకి అమెరికా ఇస్తోందని.. ఇదంతా అమెరికన్లు ఎంత కష్టపడి సంపాదించిన సొమ్ము అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాంటి నిధులతో నడుస్తున్న సంస్థ.. అమెరికాలో మరణమృదంగం మోగిస్తున్న వైరస్ ను కట్టడి చేయడంలో సరైన సమాచారం ఇవ్వలేదని ట్రంప్ ఆగ్రహించారు. మరోవైపు చాలామంది అమెరికా ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో ట్రంప్ కు పూర్తి మద్దతుగా మాట్లాడుతున్నారు. టెడ్రోస్‌ అధనోమ్‌ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా రాజీనామా చేసే వరకు నిధుల్ని నిలిపివేయాలని కోరుతూ అమెరికాలో ఉభయపక్షాలకు చెందిన 24 మంది సభ్యులతో కూడిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: