క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బాధితుల‌ను ఆదుకునేందుకు భార‌త్‌, పాకిస్థాన్ మ‌ద్య వ‌న్డే సిరీస్ నిర్వ‌హించాల‌ని పాక్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కోరుతున్నారు. రెండు జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల‌ వ‌న్డే సిరీస్ నిర్వ‌హించ‌డం మంచిద‌ని ఆయ‌న సూచించారు. బుధ‌వారం త‌న యూట్యూబ్ ఛాన‌ల్లో మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను చెప్పారు. అయితే.. భార‌త్‌, పాక్ మ‌ధ్య 2007 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వ‌హించ‌లేదు. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో సిరీస్‌లు నిర్వ‌హించ‌డం లేదు.కేవ‌లం కేవ‌లం ఐసీసీ నిర్వ‌హిస్తున్న మెగాటోర్నీల్లో మాత్రమే ఈ చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న నేప‌థ్యంలో స్టార్ బౌల‌ర్ అక్త‌ర్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు.

 

* ఇంత‌టి విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల్లో.. అంటే ఇప్ప‌టికిప్పుడు కాకున్నా.. కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిన త‌ర్వాత‌ భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ నిర్వ‌హిస్తే బాగుంటుంది. గ‌త కొన్నేండ్లుగా రెండు జ‌ట్ల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వ‌హించ‌లేదు. ఇలాంటి త‌రుణంలో క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా సిరీస్ నిర్వ‌హిస్తే.. ఎవ‌రు విజేత అనేదానితో సంబంధం లేకుండా భారీగా డ‌బ్బు స‌మకూరే అవ‌కాశం ఉంటుంది. ఆ సొమ్మును ఇరు దేశాలు కొవిడ్‌-19పై పోరుకు వినియోగిస్తే మంచిద‌ని భావిస్తున్నా. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేస్తే మేము ఆనంద ప‌డుతాం. బాబ‌ర్ ఆజ‌మ్ శ‌త‌కం సాధిస్తే మీరు సంతోష పడొచ్చు. మ్యాచ్ ఫ‌లితం ఎలా ఉన్నా.. రెండు జ‌ట్ల‌ను విజేత‌లుగానే భావించొచ్చు. భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ అంటే విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారీగా డ‌బ్బులు స‌మ‌కూరుతాయి. క‌రోనా క‌ట్ట‌డికి ఆ డ‌బ్బుల‌ను ఇరు దేశాల ప్ర‌భుత్వాలు స‌మంగా పంచుకుంటే మంచింది* అని అక్త‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: