దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతుందా ? సడలిస్తారా ?? అన్నదానిపై ఇప్పటికే అనేక ఊహాగానాలు కొనసాగిస్తున్నాయి . లాక్ డౌన్ కొనసాగించే  అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు విన్పిస్తున్న తరుణం లో, పలు ఆంక్షలతో లాక్ డౌన్ సడలించే అవకాశం ఉన్నట్లు  బీజేపీ ఎంపీ జివిఎల్ నర్సింహారావు ఒక తెలుగు ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమం లో సూత్రప్రాయంగా వెల్లడించారు .  అయితే లాక్ డౌన్ కొనసాగింపు , సడలించే అంశం పై   ఈ నెల 12 వతేదీ, లేదంటే  13 అర్ధ రాత్రి ఒక స్పష్టత వచ్చే అవకాశముందని ఆయన అన్నారు .

 

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను యధావిధిగా కొనసాగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు . లాక్ డౌన్ కొనసాగించడం మినహా మరొక మార్గం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి వారు స్పష్టం చేస్తున్నారు . అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం .. పలు ఆంక్షలను విధిస్తూ ,  లాక్ డౌన్ సడలింపుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది . గతం లో మాదిరిగా ప్రజలంతా సమూహంగా ఒక దగ్గర చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడం తోపాటు , ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించేలా కేంద్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం .

 

 బీజేపీ ఎంపీలతో ఇటీవల  జరిగిన సమావేశం లో ప్రధాని మోదీ , ఈ మేరకు  సంకేతాలను ఇచ్చినట్లు జివిఎల్ నర్సింహారావు వెల్లడించారు . ప్రతి ఎంపీ తమ కుటుంబ సభ్యులకు మాస్కులు , శానిటైజర్లు అందుబాటులో ఉంచడమే కాకుండా, పొరుగు వారుకూడా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ  పేర్కొన్నారని ఆయన  తెలిపారు . జివిఎల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ,  ఈ నెల 14 వ తేదీ తరువాత ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: