ఈ లోకంలో సంగీతం వింటు పరవశించని మనసు ఉంటుందా..  పిల్లన గోవితో శ్రీ కృష్ణుడు గోపికలతో సహా, పశుపక్ష్యాదులను కూడా అలరించాడు.. అంటే సంగీతానికి ఉన్న శక్తి అంత గొప్పది.. ఇక ఈ సంగీత సేవలో ఎందరో గొప్పవారు తరించారు.. అలాంటి వారిలో త్యాగరాజ స్వామివారు ఒకరు.. ఈయన సంగీతం యొక్క దాహార్తిని తీర్చిన మహానుభావుడు.. సంగీతంలోని స్వరాలన్ని ఈయన దగ్గరే ఊపిరిపోసుకున్నాయేమో అందుకే త్యాగరాయ స్వామివారి కీర్తి ముల్లోకాలకు పాకింది.. 'సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే' అంటూ తాను భగవదనుభూతిని పొందేందుకు అనుసరించిన ఆధ్యాత్మిక సాధనా మార్గాన్ని, కీర్తన రూపంలో లోకానికి చాటిన మహా మనీషి త్యాగయ్య.. తన సంగీతంతో దేవదేవుళ్లనే ఓల‌లాడించాడు.. 

 

 

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒక్కరుగా పిలువబడుతున్న ఈ స్వామి, త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో ప్రసిద్ది గాంచాడు.. గొప్ప వాగ్గేయకారుడు అయిన త్యాగయ్య నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన మహాజ్ఞాని.. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియ పరుస్తాయి. ఇకపోతే త్యాగయ్య ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో, తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో, కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానంగా, 1767 వ సంవత్సరంలో  వైశాఖ శుద్ధ షష్టినాడు జన్మించారు..

 

 

ఇక త్యాగరాజు తన సంగీత శిక్షణను, చాలా చిన్న వయసులోనే శొంఠి వెంకటరమణయ్య దగ్గర ప్రారంభించాడు. తనకు అబ్బిన జ్ఞానసంపత్తితో పదమూడేండ్ల చిరు ప్రాయము నాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. ఇదే కాకుండా తాను చేసిన కచేరీలో పంచరత్న కృతులలో ఐదవది అయిన ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. అప్పుడే త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి తెలిసింది. ఆయన ప్రతిభగురించి విన్న ఆ రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.

 

 

ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు. ఇకపోతే శ్రీ రాముని మహా భక్తుడైనా త్యాగయ్యకు  దేవముని అయిన నారదుడే స్వయంగా సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవము" ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు.. అలా అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు... సంగీత సామ్రాజ్యానికి రారాజుగా పేర్కొంటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: