ఇప్పుడు ఎటు చూసినా కరోనా భయం కమ్ముకుంటోంది. ప్రపంచంలో దీని బారిన పడి రోజూ వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. అందుకే ఏమాత్రం ఆరోగ్యం బాగా లేకపోయినా కరోనా వచ్చిందేమో అని జనం హడలి పోతున్నారు. ముఖ్యంగా జ్వరం, జలుబు, గొంతునొప్పి, నీరసం వంటి ఫ్లూ లక్షణాలు బయటపడితే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చి ఎవడు కరోనా అంటించాడోనని భయపడిపోతున్నారు.

 

 

దీనికి తోడు ఇప్పటికే కరోనా పాజిటివ్ ఉన్న వారి బంధువులు, కుటుంబసభ్యులు, సోషల్ కాంటాక్ట్ లు ఉన్నవారికి అత్యవసరం గా కరోనా టెస్టులు చేయాలి. అయితే ఈ కరోనా టెస్టుల ఖరీదు నాలుగున్నర వేల రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగానే చేస్తున్నా.. ప్రైవేటు ల్యాబుల్లో ఈ టెస్టులు చేయించుకోవాలంటే నాలుగున్నర వేల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చు మరీ ఎక్కువగా ఉందని భావించిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

 

 

ప్రభుత్వమే ఉచితంగా కరోనా పరీక్షలు చేయించాలని వాదించాడు. దీంతో దేశ ప్రజలందరికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన చేసింది. శశాంక్ డియో సుధి అనే న్యాయవాది వేసిన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చంది. కరోనా పరీక్షల కోసం పెద్ద మొత్తంలో వసూలు చేసేలా ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతినివ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వమే దీనికి సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలని ధర్మాసనం పేర్కొంది.

 

 

నిజంగా ఈ తీర్పు సామాన్యుడికి ఊరట నిచ్చేదే.. కరోనా వచ్చిందేమో అన్న భయం ఉన్నా.. డబ్బుకు భయపడి టెస్టులు చేయించుకోని వారికి.. ప్రభుత్వ క్వారంటైన్ కు వెళ్లడం ఇష్టం లేనివారికి ఈ కరోనా టెస్టులు బాగా ఉపయోగపడతాయి. మరి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తుందా.. చేస్తే ఎంత బాగా చేస్తుందన్నదే ఇప్పుడు అసలు విషయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: