అసలే కరోనా కాలం.. ప్రభుత్వాలకు ఆదాయం ఎటు నుంచీ రావడం లేదు. వ్యాపారాలు లేవు. రిజిస్ట్రేషన్లు లేవు. మద్యం అమ్మకాలు లేవు. ఇక ఆదాయం ఎలా వస్తుంది. మరోవైపు కరోనా వ్యాధి నియంత్రణ కోసం ఎంతో ఖర్చవుతోంది. చివరకు ఉద్యోగుల జీతాల్లో కూడా కోత వేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి కష్టకాలంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ శుభవార్త చెప్పింది.

 

 

జీఎస్టీ అమలు వల్ల ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి రాష్ట్రాలకు చెల్లించాల్సిన రెండో విడత పరిహారాన్ని విడుదల చేసింది. రెండో విడతగా 4వేల 103 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తంతో 2019 అక్టోబర్-నవంబర్ నెలలకు సంబంధించి మొత్తం 34 వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. మొదటి విడత 19 వేల 950 కోట్ల రూపాయలు ఫిబ్రవరిలోనే విడుదల చేసింది.

 

 

డిసెంబర్-జనవరి నెలలకు సంబంధించిన పరిహారాన్ని కూడా దశలవారీగా త్వరలోనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చింది. ఇక మొత్తం లెక్కలు తీస్తే... జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిహారం కింద 2 లక్షల 45వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం చెల్లించింది. 2017 జీఎస్టీ చట్టం ప్రకారం రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం ప్రతి రెండు నెలలకోసారి రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలి. కానీ కొంత కాలంగా ఈ బకాయిలు అలాగే ఉంటున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి దేశంలో ఉద్ధృతమవుతున్న సమయంలో ఈ సొమ్ములు రావడం రాష్ట్రాలకు నిధుల కొరత నుంచి కాస్త ఊరట లభించినట్టే.

 

 

లాక్‌ డౌన్‌ పుణ్యమా అని రాష్ట్రాల గల్లా పెట్టలు ఈసురోమంటున్నాయి. ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో ఎంత వచ్చినా ఆనందమే అన్నట్టు ఉంది రాష్ట్రాల పరిస్థితి. ఇలాంటి సమయాల్లో కేంద్రమే పెద్ద మనసుతో ఆదుకోవాలి. కానీ కేంద్రం సైతం కరోనాపై పోరులో ఆర్థికంగా సతమతమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: