క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం అమెరికా విల‌విలాడుతోంది. రోజుకు వంద‌ల సంఖ్య‌లో పౌరులు మ‌ర‌ణిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనాబారిన‌ప‌డ‌గా.. 14వేల మందికిపైగా మ‌ర‌ణించారు. అయితే.. అమెరికాలో ఉంటున్న భార‌తీయులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌ఠిన నిబంధ‌న‌ల‌తో ఎక్క‌డివారు అక్క‌డే ఉండిపోయారు. అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణాలు నిలిచిపోవ‌డంతో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. అయితే.. ఇందులో ప‌లువురు క‌రోనా బారిన‌ప‌డి చ‌నిపోయారు. మ‌రికొంద‌రు చికిత్స పొందుతున్నారు. అమెరికాలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న ఏపీకి చెందిన బ్రహ్మానందం క‌రోనాతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 11మంది భార‌తీయులు క‌రోనాతో చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో న‌లుగురు ట్యాక్సీ డ్రైవ‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో 16 మంది భారతీయులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది న్యూయార్క్లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియాలో ఉన్నారు. వీరంద‌రూ ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన‌వారు. 

 

ప్ర‌ధానంగా న్యూయార్క్‌లో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ 6వేల మందికిపైగా మ‌ర‌ణించారు. సుమారు 138000మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇక న్యూజెర్సీలో 15,00 మంది మ‌ర‌ణించారు. సుమారు 48వేల మందికిపైగా క‌రోనా సోకింది. అయితే.. ముందుముందు సంఖ్య నిరంత‌రం పెరుగుతూనే ఉండ‌డంతో తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌పంచంలోనే అమెరికాలో అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉంటున్న భార‌తీయులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కొవిడ్‌-19 తో బాధపడుతున్న భారతీయ పౌరులు, విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడానికి భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు నిరంత‌రం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వారికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంటోంది.  అయితే.. క‌రోనాతో మ‌ర‌ణించిన వారి అంత్య‌క్రియ‌ల‌ను మాత్రం స్థానిక అధికారులే చేప‌డుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను కూడా అనుమ‌తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో వారి కుటుంబాలు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నాయి. అమెరికాలో ఉంటున్న వారి కోసం కుటుంబాలు తీవ్ర వేద‌న‌కు గుర‌వుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: