దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో మందుబాబులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మద్యం దొరక్క కొంతమంది వింతగా ప్రవర్తిస్తుంటే మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం లేక అల్లాడిపోతున్న మందుబాబులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం మమత బెనర్జీ ఆర్డర్ చేసిన వారికి ఇంటికే మద్యం డెలివరీ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతబడిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న వారికి మద్యం డోర్ డెలివరీ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ తో పాటు ప్రభుత్వం ఫోన్ల ద్వారా కూడా మద్యం ఆర్డర్ చేసే అవకాశం కల్పించింది. మందుబాబులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫోన్ల ద్వారా మద్యం ఆర్డర్ చేయవచ్చు. 
 
ప్రభుత్వం మద్యం దుకాణాలకు మూడు డెలివరీ పాస్ లు ఇస్తుంది. డెలివరీ పాస్ లు ఉన్నవారు మాత్రమే మద్యం డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనప్పటికీ మద్యం డోర్ డెలివరికీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం స్వీట్ షాపులకు ఇదే విధంగా అనుమతులు ఇచ్చింది. 
 
దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేతపై చర్చ జరుగుతోంది. కర్ణాటక ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలు తెరిచేలా ఆదేశాలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో మద్యానికి బానిసై మతిస్థిమితం తప్పిపోయి కొందరు వింతగా ప్రవర్తిస్తుంటే మరికొందరు మద్యం తాగకుండా ఉండలేక ఏకంగా మద్యం షాపులనే లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: