కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న కొత్తగా వెలుగు చూసిన కేసుతో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 75కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. నిన్న జిల్లాలోని అయ్యలూరులో కొత్త కేసు నమోదైంది. జిల్లాలో 194 నమూనాలకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. జిల్లాలో నమోదైన కేసుల్లో ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైనవారే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. 
 
జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్లపై కనిపించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. 
 
జిల్లాలోని గణేష్ నగర్, రెవెన్యూ కాలనీ, బుధవారపేట, ప్రకాష్ నగర్, రోజా వీధి, కొత్తపేట, రెడ్ జోన్లుగా ప్రకటించిన ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. ఎవరికైనా వైద్య సేవలు అవసరమైతే వారి కోసం ఆంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుతామని ప్రకటన చేశారు. బ్యాంకులు, మెడికల్ షాపులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు కూడా మూసివేయాలని సూచించారు. 
 
ఎవరికైనా మందులు అవసరమైతే 1077 నంబర్ కు కాల్ చేయాలని చెప్పారు. జిల్లాకు విదేశాల నుంచి 840 మంది రాగా ఢిల్లీకి వెళ్లి వచ్చినవారు 357 మంది ఉన్నారు. జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాలలో 820 మంది ఉండగా వారిలో 550 మందికి పాజిటివ్ కేసుల లింకులు ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలోని ఆస్పత్రుల్లో 74 మంది కరోనా భారీన పడి చికిత్స పొందుతున్నారు.     
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: