అమెరికాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే అమెరికాలోని భారత జాతీయులు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టే సాహసం కూడా చేయడం లేదు. విధిలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

 

దాదాపు 100 మంది దాకా అమెరికాలో ఉంటున్న భారత జాతీయులు కరోనా బారిన పడి మరణించి ఉంటారని అమెరికాలోని భారత సంఘాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌లో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారే అందులో ఎక్కువగా ఉన్నారని, న్యూజెర్సీకి చెందిన ఓ పాతిక మంది దాకా ప్రాణాలు విడిచారని తెలుస్తోందన్నారు. 

 

అమెరికాలో సీనియర్‌ జర్నలిస్టుగా పని చేస్తున్న బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్‌ ఆస్పత్రిలో చనిపోయారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదని భారతీయులు వాపోతున్నారు. 

 

న్యూజెర్సీలో ఓ కుటుంబానికి చెందిన (కర్ణాటక) తండ్రి, కొడుకు కరోనా బారిన పడి చనిపోవడంతో ఇంట్లో ఉన్న అత్తా కోడలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.

 

 కరోనా వైరస్ కారణంగా ఫ్లోరిడాలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.  కరోనా వైరస్ బారిన పడిన 16 మంది భారతీయులు (వీరిలో నలుగురు మహిళలు) సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది న్యూయార్క్‌కు చెందినవారు కాగా, ముగ్గురు న్యూజెర్సీ వారు ఉన్నారు. మిగిలిన వారు టెక్సాస్, కాలిఫోర్నియాకు చెందిన వారు.

 

కరోనా బారినపడినవారు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. వీరిందరికీ సాయం అందించేందుకు ఇండియన్ రాయబార కార్యాలయాల అధికారులు ముందుకు వచ్చారు. అక్కడ స్థానిక అధికారులు, ఇండియన్-అమెరికన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: