దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తూ ఉండటంతో లాక్ డౌన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుతోంటే ఏపీ సీఎం జగన్ మాత్రం రాష్ట్రంలోని హాట్ స్పాట్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేయాలని సూచిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. 
 
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ ను కొన్ని రోజులు పొడిగించాలని ప్రధాని మోదీని కోరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఏపీలో లాక్ డౌన్ ను రెడ్ జోన్లకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. లాక్ డౌన్ వల్ల ఏపీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో లాక్ డౌన్ ను ఎత్తివేయడానికే సీఎం జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం. 
 
మరోవైపు తెలంగాణలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ఏపీలో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నిన్న తెలంగాణలో 49 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 453కు చేరింది. ఏపీలో ఈరోజు ఉదయం వరకు 348 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని అధికారులు భావిస్తున్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: