దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి వరకు 453 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదుల సంఖ్యలో వీధి కుక్కలు అంతుచిక్కని రోగంతో మరణించడంతో జిల్లా వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉండటంతో టెన్షన్ పడుతున్న జిల్లా ప్రజలు వీధి కుక్కలు మృతి చెందడంతో గజగజా వణికిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓడేడ్ గ్రామంలో ఉన్నట్టుండి 12 కుక్కలు మరణించాయి. కుక్కలు మరణించడంతో గ్రామస్తులు కుక్కలకు ఏమైందో అని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొందరు కరోనా సోకి కుక్కలు మరణించి ఉండవచ్చని వదంతులు ప్రచారం చేశారు. 
 
విషయం తెలిసిన వెంటనే పశువైద్యాధికారులు అక్కడికి చేరుకుని చనిపోయిన కుక్కలను పరిశీలించారు. గ్రామంలో శానిటైజర్లు చల్లడం, హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం వల్లే కుక్కలు చనిపోయాయని వైద్యులు చెబుతున్నారు. కెమికల్స్ పిచికారీ చేసిన నీరు ఆహారం తాగడంతో కుక్కలు మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురి కావద్దని అధికారులు సూచిస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం తమిళనాడులోని పనపాక్కం సమీపంలో పదుల సంఖ్యలో కాకులు మృతి చెందాయి. మరోవైపు లాక్ డౌన్ వల్ల కుక్కలు, కాకులు మృతి చెందుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వాటికి ఆహారం, నీళ్లు లభించక మృత్యువాత పడుతున్నాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకులు, కుక్కల మృతికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కరోనానే కారణమని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో లాక్ డౌన్ ను పొడిగించాలని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: