కరోనా మహమ్మారి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఏపీ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 348కి చేరాయి. రాకాసి వైరస్ దెబ్బకి రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. తొమ్మిది మంది బాధితులు రికవరీ అయ్యారు.  కాగా, కరోనా బాధితుల్లో ఏపీ ఇండియాలోనే ఏడో స్థానంలో కొనసాగుతోంది.

 

ఏపీలో గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా నాలుగైదు రోజుల క్రితం ఏపీలో తక్కువ సంఖ్యలోనే ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే. ఈ ఘటన తర్వాతే ఏపీలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. కర్నూలులో నిన్న ఒక్క కేసు నమోదైంది. దీంతో 75 కేసులతో ఏపీలోనే టాప్‌ ప్లేస్‌లో ఉంది. కర్నూలులో నమోదైన కేసులతో జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్. ఆర్థికమంత్రి బుగ్గన స్వయంగా.. నంద్యాల శివారులోని శాంతిరామ్ ఆసుపత్రిలోని కోవిడ్-19 సెంటర్‌ను పరిశీలించారు. ఆసుపత్రులలో సరిపడా మాస్కులు, PPEలు ఉన్నాయని ఎలాంటి కొరత‌లేదని తెలిపారు మంత్రి బుగ్గన. పోలీసులు కూడా ఆంక్షలను కఠినతరం చేశారు. జిల్లాలో 28 హాట్ స్పాట్‌లను గుర్తించి పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అత్యవసరమైనా సరే ప్రజలను కాలనీల్లోనుంచి బయటకు అనుమతించట్లేదు పోలీసులు.

 

గుంటూరులో బుధవారం కొత్తగా 8 కేసులు నమోదవడంతో.. జిల్లాలో బాధితుల సంఖ్య 49కి చేరింది. వెంటనే అలర్ట్‌ అయిన అధికారులు పది కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఇప్పటికే మంగళగిరిని రెడ్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు, రోజు వారీ రిలాక్స్‌ టైంను కూడా ఎత్తివేశారు. ప్రజలకు కావాల్సిన కూరగాయాలు, ఇతర నిత్యావసరాలను మున్సిపల్ అధికారులే ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ కేసుల సంఖ్య 49కి చేరగా.. మరో 135 రిపోర్ట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు.  

 

నెల్లూరులో బుధవారం ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ జిల్లాలో ఓ డాక్టర్‌కు కరోనా సోకడం మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే ఆస్పత్రి ప్రారంభించిన ఆ వైద్యుడు సాధారణ రోగులతో పాటు.. ఇతర డాక్టర్లను, ప్రముఖులను కలవడంతో వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. మొత్తం 1200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్వారెంటెయిన్‌లో ఉంచేందుకు సిద్ధమయ్యారు. వైద్యున్ని కలిసినవారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే...మరింత మందికి వైరస్ విస్తరించే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 38 ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు అధికారులు.

 

కృష్ణా జిల్లాలోకు కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం జిల్లాలో 35 పాజిటివ్ కేసులు ఉండగా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 49 మంది క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపించకపోవడంతో వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పట్లు చేశారు అధికారులు. రెండు బస్సుల్లో వారిని స్వస్థలాలకు పంపారు. ఇక, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరిని 14 రోజుల పాటు ట్రిపుల్ ఐటీలో అబ్జర్వేషన్‌లో ఉంచుతోంది ప్రభుత్వం. 

 

కడపలో బుధవారం కేసులేమీ నమోదు కాలేదు. ప్రస్తుతం జిల్లాలో 28 మంది బాధితులు ఉన్నారు. అయితే, జమ్మలమడుగులో పోలీసుల దౌర్జన్యం కలకలం రేపింది. విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగిపై ఎస్సై రవికుమార్ దాడికి పాల్పడ్డాడు. కరోనాతో లాక్‌డౌన్ కొనసాగుతుండగా ఎందుకు బయట తిరుగుతున్నావంటూ ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. సహోద్యోగులు వారిస్తున్నా... అసభ్య పదజాలంతో సచివాలయ ఉద్యోగిపై విరుచుకుపడ్డాడు.

 

ప్రకాశం జిల్లాలో కొత్తగా 3 కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 27కు చేరుకుంది. కరోనా బారిన పడిన వారిలో నిజాముద్దీన్  నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరి ద్వారా మరి కొంతమందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. లండన్ నుంచి ఒంగోలు వచ్చిన ఓ యువకుడితో పాటూ ఢిల్లీ నుంచి వచ్చిన మరో యువకుడు కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాలో రోజు రోజుకు పెరుగుతుండటంతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.

 

చిత్తూరు జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో ఆరు, నగరిలో నాలుగు, పలమనేరులో మూడు, శ్రీకాళహస్తిలో మూడు, రేణిగుంటలో రెండు, ఏర్పేడు, నిండ్రలో ఒక్కోకేసు నమోదైంది. ఆరుకేసుల్లో  మర్కజ్‌ లింక్‌లు ఉన్నట్టు గుర్తించారు. తిరుపతిలో ఏకంగా 11వార్డులు రెడ్‌జోన్‌ పరిధిలోకి వెళ్లాయి.

 

అనంతపురం జిల్లాలో కరోనా అలజడి సృష్టిస్తోంది. పేషెంట్ల నుంచి వైద్యులకు కరోనా సోకడంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది.  తూర్పు గోదావరి జిల్లాలోనూ 11 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులోని తంగెళ్లమూడి, తూర్పు వీధి, కత్తెపు వీధి, వైఎస్సార్ కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. దీంతో ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయకు  రావడం లేదు. కరోనాపై యుద్ధం చేసిన ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. 

 

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులు నమోదైన వారి ఇళ్ల చుట్టుపక్కల 2కిలో మీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని కరోనా లక్షణాలున్న వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇక, విజయనగం, శ్రీకాకుళం కరోనా ఫ్రీ జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: