కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు జనం. ఇప్పుటికే 15 లక్షలకు పైగా కరోనా బారినపడగా... 88 వేలకు పైగా బాధితుల్ని పొట్టనపెట్టుకుంది మహమ్మారి. అయితే, లాక్‌డౌన్‌లు పాటిస్తున్నా... వైరస్‌ విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 

 

ఉన్న వాళ్లు-లేని వాళ్లనే అనే తేడా లేదు... పేద-గొప్ప దేశాలనే తారతమ్యం అస్సల్లేదు... ప్రపంచ వ్యాప్తంగా మానవాళికే పెద్ద ముప్పులా తయారైంది కరోనా వైరస్‌. వైద్య రంగంలో విశేషమైన అభివృద్ధి సాధించిన దేశాలు సైతం... మహమ్మారిని తట్టుకోలేకపోతున్నాయి. వీధుల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.   


  
ప్రపంచ వ్యాప్తంగా ఇంత వరకూ 15 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 88 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజే 65 వేల కరోనా కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారంటే... దీని తీవ్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 


   
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీళ్లలో దాదాపు 50 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అమెరికాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అమెరికాలో ఇంత వరకూ 22 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా, 4 లక్షల 22 వేల మంది కరోనా పాజిటీవ్‌ వచ్చింది. అలాగే, దాదాపు లక్షా 47 వేల పాజిటీవ్‌ కేసులతో రెండో స్థానంలో ఉంది స్పెయిన్‌. స్పెయిన్‌లో గడిచిన 24 గంటల్లోనే 4 వేల 800 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌లలో కరోనా కొంత వరకూ నెమ్మదించింది. స్పెయిన్‌లో ఇంత వరకూ 14 వేల 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఇందులో 628 మంది గడిచిన 24 గంటల్లోనే మృతిచెందారు. 


  
లక్షా 40 వేల కరోనా కేసులతో ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇంత వరకూ దాదాపు 11 వేల మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 3 వేల 800కు పైగా కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదు కాగా...  542 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో  మొత్తం కేసులు లక్షా 13 వేలకు పైగా ఉంటే... ఇంత వరకూ 11 వేల మందికి పైగా చనిపోయారు. 3 వేల 900 కొత్త కేసులు నమోదు కాగా, తాజా మరణాలు 550కి పైగా నమోదయ్యాయి. జర్మనీ కరోనా కేసులు లక్షా 10 వేలు దాటాయి. ఇంత వరకూ 2 వేల 200 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3 వేల కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 176 మరణాలు సంభవించాయి.  
బ్రిటన్‌లోనూ కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. బ్రిటన్‌లో ఇంత వరకూ 61 వేల మందికి కరోనా సోకింది. 7 వేలకు పైగా మరణాలు సంభవించాయి. తాజాగా 5 వేల 500 మందికి పైగా కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.


 
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో మాత్రం వైరస్‌ ఉధృతి అనూహ్యంగా తగ్గిపోయింది. వూహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. చైనాలో గడిచిన 24 గంటల్లో కేవలం 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కేవలం రెండే మరణాలు సంభవించాయి. చైనాలో ఇంత వరకూ 81 వేల 800 మంది కరోనా వైరస్‌ భారిన పడగా, మొత్తం 3 వేల 333 మంది చనిపోయారు. సుమారు 77 వేల మంది పూర్తిగా కోలుకోగా, దాదాపు 12 వేల మంది చికిత్స పొందుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: