అమెరికా.. క‌రోనావైర‌స్‌తో విల‌విలాడుతున్న అగ్ర‌రాజ్యం. ప్ర‌పంచంలో ఏమూల‌న శత్రువు దాక్కున్నా..  అత్యాధునిక ఆయుధాల‌తో క్ష‌ణంలో చంపేయ‌గ‌ల స‌త్తా ఉన్న ఏకైక దేశం. కానీ.. క‌రోనా వైర‌స్ అనే శ‌త్రువును మాత్రం ఇప్ప‌టికీ ఏమీ చేయ‌లేక‌పోతోంది. రోజూ వంద‌ల‌మందిని పొట్ట‌న‌బెట్టుకుంటున్నా.. కొవిడ్‌-19ను మాత్రం ఇప్ప‌టికీ ప‌ట్టుసాధించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే నాలుగు ల‌క్ష‌ల మందికిపైగా వైర‌స్‌బారిన ప‌డ‌గా.. సుమారు 14వేల మంది మ‌ర‌ణించారు. అయితే.. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన ఈ వైర‌స్‌.. అస‌లు అమెరికాలోకి ఎలా వ్యాపించింది..? అన్న‌దానిపై చాలా రోజులుగా చ‌ర్చ‌సాగుతోంది. అయితే.. తాజాగా.. ఈ ప్ర‌శ్న‌కు ఓ స‌మాధానం దొరికింద‌ని చెప్పొచ్చు. ఆ వైర‌స్ ప్ర‌ధానంగా యూరోప్ నుంచి న్యూయార్క్‌కు వ్యాపించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నార‌ని న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించిన క‌థ‌నం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే వైర‌స్ న్యూయార్క్‌కు చేరుకున్న‌ట్లు జ‌న్యు విశ్లేష‌ణ‌ ద్వారా ప‌రిశోధ‌కులు చెబుతున్నార‌ని పేర్కొంది. 

 

యూరోప్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల వ‌ల్లే అమెరికాకు క‌రోనా వైర‌స్ వ్యాపించిన‌ట్లు ఇచాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప‌నిచేస్తున్న జ‌న్యుశాస్త్ర‌వేత్త హార్మ్ వాన్ బాకెల్ తెలిపారు. ఆ వ‌ర్సిటీ త‌మ స్ట‌డీ పేప‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అలాగే.. ఎన్‌వైయూ గ్రాస్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే సంస్థ కూడా ఇదే విష‌యాన్ని చెబుతోంది. మార్చి నెల‌లో న్యూయార్క్ బాధితుల నుంచి సేక‌రించిన వైర‌స్ జ‌న్యు క్ర‌మాన్ని స్ట‌డీ చేసిన త‌ర్వాత రెండు బృందాలు ఇదే అంచ‌నాకు వ‌చ్చాయి. ఎన్‌వైయూ ప‌రిశోధ‌కులు సుమారు 75 మంది కోవిడ్ పేషెంట్ల న‌మూనాల‌ను ప‌రిశీలించారు. అయితే ఆ ఇందులో మూడ‌వ వంతుమందికి యురోపియ‌న్ లింకులు ఉన్న‌ట్లు ప్రొఫెస‌ర్ ఆడ్రియానా హేగూ తెలిపారు.  బ్రిట‌న్‌తో పాటు ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, నెద‌ర్లాండ్స్ లాంటి యురోపియ‌న్ దేశాల నుంచి న్యూయార్క్‌కు వైర‌స్ ప్ర‌బ‌లి ఉంటుంద‌ని ఆయ‌న‌ అంచ‌నా వేశారు.  ప్రతి రోజూ యూరోప్ నుంచి అమెరికాకు వ‌స్తున్న విమాన ప్ర‌యాణికుల వ‌ల్ల కూడా వైర‌స్ వ్యాప్తి చెంది ఉంటుంద‌ని భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: