మహదానందపడే మాట చెప్పింది... మమతా బెనర్జీ సర్కారు. లాక్‌డౌన్‌ వేళ ఏది కొనాలన్నా తీవ్ర ఇబ్బందులున్న పరిస్థితుల్లో... మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే... తాగక ముందే కిక్కు ఎక్కినంత సంబరపడిపోతున్నారు.. బెంగాల్లోని మద్యం ప్రియులు.

 

లౌక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ బంద్‌ అయ్యాయి. కేవలం నిత్యావసరాలు.. అంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు, పెట్రోల్‌, మెడిసిన్స్‌ లాంటివి మినహా ఏదీ దొరకడం లేదు. దొరకని వాటి లిస్టులో మద్యం కూడా ఉంది. రెండు వారాలుగా మద్యం దొరక్కపోవడంతో... దేశంలోని చాలా రాష్ట్రాల్లో మందుబాబులు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని తీసుకుని కుటుంబసభ్యులు ఆస్పత్రులకు పరిగెట్టడంతో... చాలా చోట్ల బెడ్స్‌ కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. 

 

మద్యం తాగకుండా ఉండలేని వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో... బెంగాల్‌ ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇకపై నేరుగా మందుబాబుల ఇంటికే మద్యాన్ని సరఫరా చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా మందుబాబులకు స్వాంతన కలగడంతో పాటు... రాష్ట్ర ఖజానాకు కూడా కాస్తోకూస్తో ఆదాయం సమకూరుతుందనే ఉద్దేశంతో... మమత సర్కారు ఈ నిర్ణయానికి వచ్చింది. 

 

నిజానికి మద్యం అమ్మకాలపై బెంగాల్లో నిషేధమేమీ విధించలేదు. కానీ... లాక్‌డౌన్‌ కారణంగా మద్యం వ్యాపారులు షాపులు తెరవడానికి వీల్లేకుండా పోయింది. అందుకే మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు అనుమతిచ్చామని... బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. దీని కోసం వ్యాపారులు స్థానిక ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రతి దుకాణానికీ కేవలం మూడు పాస్‌లు మాత్రమే మంజూరు చేయబోతున్నారు. 

 

మద్యం డోర్‌ డెలివరీ ప్రక్రియ కోసం కొన్ని నిబంధనలు కూడా విధించారు.  ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఫోన్‌ ద్వారా మద్యం ప్రియులు ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్పందించవద్దని బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ వ్యాపారులను ఆదేశించింది. ఇక మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల దాకా డోర్‌ డెలివరీ చేయాలని సూచించింది. రెండు వారాలుగా మద్యం దొరక్క నాలుక పీక్కుపోతున్న బెంగాలీలు... ఎలాగైతేనేం... చివరికి మద్యం దొరికినందుకు ఎగిరి గంతేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: