కరోనా వైరస్‌ పుట్టింది చైనాలో అయినా... అమెరికా, యూరప్‌లలో తన ప్రతాపం చూపిస్తోంది. అడ్డూ-అదుపు లేకుండా వ్యాపిస్తున్న వైరస్‌తో పోరాటంలో బాధిత దేశాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించిన పలు యురోపియన్‌ దేశాలు... ఇప్పుడు ఆంక్షల్ని సడలించే దిశగా అడుగులు వేస్తున్నాయి.  మరోవైపు... యూరోజోన్‌ కరోనా వైరస్‌ రెస్క్యూ ప్లాన్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడం పలు దేశాలను నిరాశపర్చింది. 

 

యూరప్‌ ఖండంలో కరోనా వైరస్‌ బారిన పడి 60 వేల మందికి పైగా చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన మరణాల్లో దాదాపు 70 శాతం యూరప్‌ దేశాల్లో సంభవించాయి. మరోవైపు లాక్‌డౌన్‌లు ప్రకటించడంతో యూరప్‌ దేశాల ఆర్థిక పరిస్థితులు గాడితప్పాయి. కరోనాతో పోరాటాన్ని కొనసాగించడానికి సైతం పలు దేశాలు వద్ద నిధులు లేని పరిస్థితి నెలకొంది. 


  
యూరప్‌లోని కొన్ని దేశాల వద్ద కరోనాపై పోరాటానికే కాదు... పరిపాలనా యంత్రాన్ని నడిపించడానికి నిధులు ల్లేవు. ముఖ్యంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ, స్పెయిన్‌ లాంటి దేశాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 476 బిలియన్‌ డాలర్ల రెస్క్యూ ప్లాన్‌ తయారు చేసినా... దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. 

 

యురోపియన్‌ స్టెబిలిటీ మెకానిజం కింద యూరో జోన్‌ బెయిలౌట్‌ ఫండ్‌ నుంచి... ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలు అత్యవసరంగా అప్పు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇలా అప్పు తీసుకునే దేశాలు కొన్ని షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన షరతులు కూడదంటూ కొన్ని దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అయితే, త్వరలోనే ఈ చర్చలు కొలిక్కి వస్తాయని స్పెయిన్‌ వంటి దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 


  
మరోవైపు... లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలించే యోచనలో ఉన్నాయి యూరప్‌లోని కొన్ని దేశాలు. ఈ విషయంలో ఆస్ట్రియా, డెన్మార్క్‌ ముందున్నాయి. అయితే ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడంతో పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం హంగేరితో ఆస్ట్రియా చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు కొలిక్కి వస్తే... లాక్‌డౌన్‌ను సడలించే అవకాశం ఉంది. అలాగే, వీటి బాటలో మరికొన్ని దేశాలు పయనించనున్నాయి. 

 

మరోవైపు కరోనా బారిన పడి... ఆస్పత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. సెంట్రల్‌ లండన్‌ వెస్టమినిస్టర్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో రెండు రోజులుగా ఉన్న ఆయన... చికిత్సకు స్పందిస్తున్నారు. వెంటిలేటర్‌ అవసరం లేకుండానే శ్వాస తీసుకుంటున్నారు బోరిస్‌ జాన్సన్‌.  

మరింత సమాచారం తెలుసుకోండి: