ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కరోనా ఎంత హాట్ టాపిక్‌గా ఉందో, చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండటం కూడా అంతే హాట్ టాపిక్‌గా ఉంది. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ, మీడియా, సోషల్ మీడియా వేదికగా కరోనా వ్యాప్తి పట్ల ప్రజలని అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా కొన్ని సలహాలు ఇస్తూ, లేఖలు రాస్తున్నారు. ఇంకా సమస్యలు ఉంటే వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

అయితే ఇక్కడే వైసీపీ నేతలకు ఇబ్బంది వస్తుంది. బాబు పక్క రాష్ట్రంలో ఉంటూ సలహాలు ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. బాబు సొంత రాష్ట్రంలో ఉండి చెప్పాలని, కరోనాకు భయపడే విజయవాడ వదిలి ఫ్యామిలీతో హైదరాబాద్‌లో దాక్కున్నారని మండిపడుతున్నారు. బాబు కరోనాపై రాజకీయాలు చేస్తున్నారంటూ, కొందరు వైసీపీ నేతలు కాస్త ఘాటు పదజాలంతోనే బాబుపై విరుచుకుపడుతున్నారు. అలాగే కరోనాపై పెద్ద యుద్ధమే చేస్తున్నారని చెప్పి, జగన్‌ని పొరుగు రాష్ట్రాలతో పాటు, పి‌ఎం, విదేశాలు కూడా మెచ్చుకుంటున్నాయని అంటున్నారు.

 

ఇక వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు అసలు అర్ధంలేనివని తమ్ముళ్ళు కొన్ని లాజిక్‌లు చెబుతున్నారు. అసలు బాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి, ప్రతివారాంతంలో హైదరాబాద్ వచ్చి, ఫ్యామిలీతో గడిపి, మళ్ళీ సోమవారం ఏపీకి వస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 21 శనివారం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. ఇక ఆదివారం ప్రధాని జనతా కర్ఫ్యూ పెట్టి, ఆ వెంటనే లాక్ డౌన్ విధించారు. దీంతో బాబు హైదరాబాద్‌లోనే ఉంటూనే, మీడియా ద్వారా కరోనా వ్యాప్తి పట్ల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలని ఆదుకోవాలని కోరుతున్నారు.

 

అయితే ఇక్కడ బాబు పెద్దగా రాజకీయంగా మాట్లాడిన సందర్భాలు లేవు. కొన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సూచించడం తప్ప. ఇక దానికే వైసీపీ నేతలు హైదరాబాద్‌లో ఉండి విమర్శలు చేస్తున్నారని, కరోనాకు భయపడి హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారంటూ మాట్లాడుతున్నారు. ఇక వీరికి తెలుగు తమ్ముళ్ళు సమాధానం కూడా గట్టిగానే ఇస్తున్నారు. బాబు ఏపీకి వచ్చినా....ఇంటి దగ్గర నుంచే ప్రజలకు జాగ్రత్తలు చెబుతారని, అలా కాదని ప్రజలు మధ్యలోకి కష్టాలు తెలుసుకునే పని చేస్తే మళ్ళీ బాబు రాజకీయం చేస్తున్నారని అంటరాని చెబుతున్నారు.

 

అదేవిధంగా కరోనాకు భయపడి విజయవాడలో ఉండకుండా హైదరాబాద్‌లో దాక్కున్నారంటే, హైదరాబాద్‌లో కరోనా వైరస్ లేదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాలు, విదేశాలు, పి‌ఎం సైతం జగన్‌ని పొగిడితే బాబుకు మంట అంటే కామెడీగా ఉందని చెబుతున్నారు. మొత్తానికైతే వైసీపీ నేతలు బాబుపై చేసే విమర్శలకు తెలుగు తమ్ముళ్ళు లాజిక్‌గా వివరణ ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: