ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 15 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు జరిగిన కరోనా పరీక్షల్లో ప్రకాశంలో 11, గుంటూరులో 2 , తూర్పు గోదావరి మరియు కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసులతో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా సోకిన ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
ఈరోజు ఉదయం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గిందని ఆనందించేలోపే కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు నమోదైన కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 471కు చేరింది. ఇరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో టెన్షన్ తగ్గడం లేదు. మరోవైపు ప్రజల్లో లాక్ డౌన్ గురించి స్పష్టత రాకపోవడంతో కంగారు మొదలైంది.లాక్ డౌన్ పొడిగించాలనే నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు స్వాగతిస్తున్నా దినసరి కూలీలు, పేద ప్రజలు లాక్ డౌన్ కొనసాగిస్తే తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కరోనా వల్ల కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా ప్రజలకు పూర్తి స్థాయిలో ఆ చర్యల వల్ల ప్రయోజనం కలగట్లేదు.     

మరింత సమాచారం తెలుసుకోండి: