గత 40 రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తుందనే విషయం తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో ఇరు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఇరు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ కాంటాక్ట్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో నిన్న కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 471కి చేరింది. వీరిలో 388 మంది మర్కజ్ ప్రార్థనలతో ఏదో ఒక రకంగా సంబంధం ఉన్నవారు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా భారీన పడి 12 మంది మృతి చెందారు. 
 
రాష్ట్రంలో 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల తర్వాత కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీలో తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఉదయం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో జీరో కేసులు నమోదయ్యాయి. 
 
నిన్న రాత్రి విడుదల చేసిన బులెటిన్ లో 15 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 363కు చేరింది. నిన్న ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రంల్లో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: