ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం ఇంకా చల్లారినట్టు  కనిపించడం లేదు. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న సమయంలోనూ ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే క్యాబినెట్ సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిగించేందుకు ఒక నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు. ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కాకముందే దాన్ని సాకుగా చూపిస్తూ ఏపీలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఈ విషయం పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో అనేక ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించారు. 

 

అదే సమయంలో ఏపీలోనూ తీవ్రస్థాయిలో కరోనా విజృంభించడంతో ఎన్నికల సంగతి అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం ఏపీలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆయన రాజ్యాంగ పరిధిలో ఉండటంతో ఆయనను పదవి నుంచి తప్పించాలని, దీని కోసం అభిశంసన చేపట్టాలి. పార్లమెంటు ఉభయ సభల అంగీకారంతో పాటు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే అభిశంసన పూర్తయ్యి కమిషనర్ పదవిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యవహారం అంత తేలిగ్గా జరిగే విషయం కాదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ ను తెరపైకి తీసుకు వస్తోంది వైసీపీ ప్రభుత్వం. 

 

విధి నిర్వహణలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విఫలమయ్యారనే కారణం చూపిస్తూ ఆయనపై వేటు వేయాలని చూస్తోంది. మరో కొద్ది రోజుల్లో ఏపీ కేబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తొలగించే అంశంపైన, ఆర్డినెన్స్ పైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించే విషయంలోనూ అనేక సంస్కరణలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కమిషనర్ గా నియమించే వ్యక్తి కి కనీసం హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన వారు అవ్వడంతో పాటు, మూడేళ్ల పదవీ కాలంలో మాత్రమే ఉండేలా నిబంధనలు తీసుకురావాలని రాష్ట్రపతిని కోరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: