కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 15 ప్రాంతాలను గుర్తించి అష్టదిగ్బంధం చేసింది.  క్లస్టర్‌ కంటైన్మెంట్లు ఏర్పాటు  చేశారు. ఈ ప్రాంతాలు పోలీసుల పహారాలో ఉంటున్నాయి. డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

 

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 15 కరోనా హాట్ స్పాట్లను తెలంగాణ ప్రభుత్వం  గుర్తించింది. ఈ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో పదిహేను, పదహారు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారి నుంచి చుట్టు పక్కల వారికి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా లక్షణాలు పైకి కనిపించకున్నా....చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది.

 

హైదరాబాద్‌  జీహెచ్‌ఎంసీ పరిధిలో క్లస్టర్‌ కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌, చింతల్‌బస్తీ, పంజగుట్ట, రామ్‌గోపాల్‌ పేట,..మారేడుపల్లి, షేక్‌పేట్‌లో క్టస్టర్‌ కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు. అల్వాల్‌ పరిధిలో అస్మత్‌పేట్‌, జగద్గిరిగుట్ట, రాజేంద్రనగర్‌, హఫీజ్‌పేట్‌, కూకట్‌పల్లిలో క్లస్టర్‌ కంటైన్మెంట్లు  ప్రకటించారు. క్లస్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. నిత్యావసర సరుకులు కూడా ఇళ్ల వద్దకే చేర్చేతున్నారు. క్లస్టర్‌ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

 

ఖైరతాబాద్‌ చింతల్‌ బస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ ఇల్లు ఉన్న గల్లీల ముందు బారికేడ్లు పెట్టారు. పారిశుద్ధ్యం, క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్‌ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 

అక్కడ అంతా నిశ్సబ్దం రాజ్యం ఏలుతోంది. ఇంటి తలుపులు, కిటికీలు సైతం మూసి బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హైదరాబాద్‌లో హాట్‌ స్పాటుగా ప్రభుత్వం ప్రకటించిన పాతబస్తీలోని  హఫీజ్‌ బాబా నగర్‌  పరిస్థితి ఇది. ఈ ప్రాంతాన్ని  దిగ్బంధం చేసింది.

 

నగరంలోని AC గార్డెన్‌ కాలనీలో కరోనా కేసులు నమోదయ్యాయ్‌. కాలనీలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. మరో ముగ్గురికి వైరస్‌ లక్షణాలు కన్పించాయ్‌.  దీంతో కాలనీని హాట్‌స్పాట్‌ జోన్‌గా ప్రకటించారు అధికారులు. జన సంచారం ఎక్కువగా ఉండే ఈ కాలనీలో అన్ని దారులను మూసివేశారు.

 

మల్లెపల్లిలోని బడే మసీద్‌ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు అధికారులు. చుట్టు పక్కల ప్రాంతాల్లో బారికేడింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రజలను ఎవ్వర్ని బయటకు రావొద్దంటున్నారు. ప్రజలకు నిత్యవాసరాలను పోలీసులు, ghmc సిబ్బంది ఇంటి వద్దకే తెచ్చి ఇస్తారని తెలిపారు. 

 

రెడ్‌ జోన్లలో నివసిస్తున్న కుటుంబాలకు , నిత్యవసరాల సరఫరా బాధ్యత కూడా స్థానిక అధికారులే తీసుకుంటున్నారు. కూరగాయలు, పాలు వంటి నిత్యవసరాలు డోర్‌ డెలివరీ జరిగేట్లు చూస్తున్నారు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: