తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్నటివరకూ రాష్ట్రంలో 473 మంది కరోనా భారీన పడ్డారు. ప్రతిరోజూ రాష్ట్రంలో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాష్ట్ర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. 
 
ప్రభుత్వం 2019 - 2020 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపులు ఎటువంటి జరిమానా లేకుండా రాబోయే మూడు నెలల్లో చెల్లించే అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ దీనికి సంబంధించిన ఫైల్ పై ఈరోజు సంతకం చేశారు. పట్టణ, స్థానిక సంస్థల ప్రజలు ఆస్తి పన్ను రాబోయే మూడు నెలల్లో ఎటువంటి జరిమానా లేకుండా చెల్లించవచ్చు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఆస్తి పన్ను కట్టించుకునే పద్ధతిని మెరుగుపరచాలని సూచించారు. 
 
స్థానిక సంస్థల కమిషనర్లు ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పౌరులకు ఆన్‌లైన్‌ ద్వారా ఆస్తి పన్ను కట్టించుకునే పద్ధతిని ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి కార్యాలయానికి వస్తే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని.... పన్ను చెల్లించేవారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉండటంతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గుతోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా ప్రస్తుతం కేవలం కోటి రూపాయలు మాత్రమే ఆదాయం సమకూరుతోంది. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనుంది. రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: