ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తొల‌గింపు వ్య‌వ‌హారంపై అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న వైఖ‌రిని తెలిపింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల కమిషనర్ వ్యవహారం విధానపరమైన నిర్ణయమ‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందని పేర్కొన్న ఆయ‌న ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విధానపరమైన నిర్ణయంలో టీడీపీ నేతలకు ఉన్న అభ్యంతరమేంటి? అని వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి సూటిగా ప్ర‌శ్నించారు. 

ప్ర‌భుత్వ నిర్ణ‌యం గురించి అంబ‌టి రాంబాబు వెల్ల‌డించారు. ``వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదు.  వ్యవస్థ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్ఈసీకి ఉంటుంది.  గవర్నరే ఎస్ఈసీని నియమిస్తారు ఇప్పుడు కొత్త విధానానికి గవర్నరే ఆమోదం తెలిపారు. పూర్తి ప్రజాస్వామిక విధంగా, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాం. ఎన్నికల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ` అని అంబ‌టి తెలిపారు.

 

ఎన్నికల సంఘంలో మార్పులు సహజమ‌ని అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. ``ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు, గవర్నర్‌కు మెయిల్ లో లేఖ కూడా పంపారు. ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకుంటారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోర్టులు చెప్పాయి. కేంద్రంలో సాధారణ ఎన్నికల కోసం  కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది.. ఇవి నిష్పక్షపాతంగా పని చేసేలా చూడాలి. గ‌తంలో ఐదు ఏళ్ళు పదవిలో ఉండేలా కమిషనర్ ఉండేవారు. ఇప్పుడు మూడేళ్లు ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ నేతలకు ఉన్న ఇబ్బంది ఏంటి?`` అని ప్ర‌శ్నించారు.


 

త‌మ మనిషి ప‌ద‌విలో నుంచి వెళ్లిపోతున్నాడని టీడీపీ నేతలు బాధపడుతున్నారని అంబ‌టి ఎద్దేవా చేశారు. ``బడ్జెట్ కూడా ఆర్డినెన్సు ద్వారా ఆమోదించారు.243 k నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ నియమిస్తారు. ఆయన పదవి మూడేళ్లకు తగ్గిస్తూ గవర్నర్  ఆర్డినెన్స్ ఆమోదించారు. అయితే, కొంపలు మునిగిపోయినట్లు చంద్రబాబు, కన్నా, నారాయణ గగ్గోలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది. ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం.`` అని అంబ‌టి తేల్చిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: