అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. అక్కడ నిన్న ఒక్క రోజే 27 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. న్యూయార్క్‌లో అయితే... ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

 

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో... మొత్తం బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరువలో ఉంది. శుక్రవారం ఒక్కరోజే 27 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 18 వేలు దాటి పోయింది. 

 

న్యూయార్క్‌లో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఈ నగరం ప్రపంచంలోనే టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. ఇక్కడ నమోదైనన్ని వైరస్‌ కేసులు... ప్రపంచంలోని ఏ దేశంలోనూ నమోదు కాలేదు. అమెరికా మొత్తం నమోదైన కేసుల్లో మూడో వంతుకు పైగా... అంటే లక్షా 70 వేలకుపైగా కేసులు న్యూయార్క్‌లోనే బయటపడ్డాయి. మృతుల సంఖ్య కూడా న్యూయార్క్‌లో 8 వేలకు చేరువలో ఉంది. 

 

న్యూయార్క్‌లో మృతదేహాలను పూడ్చడానికి కూడా చోటు లేకపోవడంతో... బ్రాంక్స్‌ సమీపంలోని హార్ట్‌ ఐలాండ్‌లో సామూహిక ఖననం చేశారు. తెలుపు రంగు బాక్సుల్లో భారీగా కరోనా మృతదేహాలను ఉంచి... వాటిని ఒకదానిపైన ఒకటి పేర్చి పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారు గానీ ఎవరూలేకుండానే ఈ సామూహిక అంత్యక్రియలను నిర్వహించారు. 

 

అమెరికాలో తాజా పరిస్థితిని సమీక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్‌... దేశంలో వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య లక్ష లోపే ఉండొచ్చని చెప్పారు. గతంలో లక్ష నుంచి 2 లక్షల మంది వైరస్‌కు బలవుతారని అంచనా వేశామని... కానీ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల కారణంగా మృతుల సంఖ్య లక్ష లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నామని ట్రంప్‌ చెప్పారు. దేశ ఆర్థిక రంగం కూడా త్వరలోనే కోలుకుంటుందన్న ఆయన... ఆర్థిక రంగ పునరుద్ధరణ చర్యల కోసం టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. మరోవైపు... కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు ఆర్థిక సాయం అందించేందుకు... ట్రంప్‌, 26 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేశారు. 

 

అమెరికాలో కరోనా యాంటీ బాడీ పరీక్షలు త్వరలోనే ప్రారంభవుతాయని ఆశిస్తున్నట్లు... ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ చెప్పారు. వైరస్‌ను నిర్మూలించడానికి ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇక మే 1వ తేదీ నుంచి దేశ ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని... అమెరికా ఆర్థిక మంత్రి స్టీవ్‌ మాక్‌నూచిన్‌ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: