పసుపు రైతులు కన్నీరు పెడుతున్నారు. చేతికి వచ్చి పంట అమ్ముకోవాల్సిన సమయంలో కరోనా ఎఫెక్ట్ వారిని నిండా ముంచేసింది. అసలే ఒకవైపు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతుంటే...కరోనా మరింత కష్టాల్లోకి నెట్టింది. 

 

నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పసుపు సాగు అవుతూ ఉంటుంది. దేశంలో పసుపు సాగు 50 నుంచి 60శాతం వరకు ఇతర రాష్ట్రాలలో అయితే ఒక్క తెలంగాణలోనే ఏకంగా 30నుంచి 40శాతం వరకు సాగు అవుతుంది. దీన్ని బట్టి  చెప్పవచ్చు తెలంగాణలో పసుపు పంటకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. 

 

నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ తో పాటు వరంగల్ జిల్లాలో సైతం కొంతమేర సాగు అవుతుంది. ప్రతి ఏటా 50వేల ఎకరాలలో పసుపు సాగు చేస్తు వుండగా ఒక ఆర్మూర్ డివిజన్ లో 35వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్ ప్రారంభంలో పసుపు పంట వేస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో పంట చేతికి వస్తుంది. మొత్తం పంట కాల వ్యవధి తొమ్మిది నెలలు.. ఎకరం విస్తీర్ణంలో సాగు చేయాలంటే లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నా, గిట్టుబాటు ధర మాత్రం రావడంలేదని రైతన్నలు గత కొంతకాలంగా ధర్నాలు,రాస్తోరోకోలు చేస్తునే ఉన్నారు..ఎన్నో ఉద్యమాలు సైతం చేశారు.

 

తాజాగా పసుపు రైతులను కరోన మరింత కష్టాల్లోకి నెట్టేసింది. అసలే మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతుంటే, కరోనా పసుపు రైతులను పూర్తిగా రోడ్డున పడేసింది. మార్చి నెల రెండో వారం నుంచే కరోనా ఎఫెక్ట్ తో పసుపు ఎగుమతులు నిలిచిపోయాయి. దాంతో వ్యాపారులు పసుపు ధరను భారీగా తగ్గించేసి అమ్మకాలు జరిపారు. సగానికి సగం ధర వచ్చినా చేసేది ఏమిలేక కొందరు రైతులు పసుపును అమ్మేసుకున్నారు. 6వేలు క్వింటా ఉండే పసుపును, వ్యాపారులు కేవలం 3వేల రూపాయాలకే కొనుగోలు చేశారు. దీంతో రైతులకు కనీసం వారి పెట్టిన పెట్టుబడి రాక.. నష్టాలు వచ్చాయి. 

 

ఇక మార్చి 22న దేశమంతా లాక్ డౌన్ విధించడంతో పసుపు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారులు సైతం కొనుగోళ్లు  చేయలేమని తెల్చి చెప్పేయడంతో  అధికారులు మార్కెట్ ను బంద్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. ప్రభుత్వం పసుపు రైతులకు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొందరు స్తోమత ఉన్న రైతులు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నా...చాలా మంది రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. సరిగ్గా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభంలోనే, కరోనా ఎఫెక్ట్  మొదలవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటి నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభమవుతాయో క్లారిటి లేకపోవడంతో, మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతన్నలు  కోరుతున్నారు.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: