ఏ శుభకార్యం జరపించాలన్నా.. ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్నా అర్చకులు ఉండాల్సిందే. కానీ లాక్ డౌన్ కారణంగా అర్చకుల జీవనం భారంగా మారింది. దాంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపించింది. అర్చక సంక్షేమ నిధి నుంచి సాయాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే తమలాగే ఆదాయం కోల్పోయిన మిగిలిన వారిని ఆదుకోవాలని అర్చకులు కోరుతున్నారు.  

 

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. అన్ని రంగాలతోపాటు.. ఆఖరుకు దేవాలయాలకు కూడా తాళాలు వేశారు. దీంతో దేవుడికి నిత్య కైంకర్యాలు నిర్వహించే అర్చకుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.   

 

ఈ ఏడాది మార్చి నుండి మే వరకు పెళ్లిళ్ల సీజన్. ప్రతీ ఏడాది పెళ్లిళ్లు వ్రతాలు, పూజలతో నిత్యం బిజీగా ఉండే అర్చకులు..ఈ సారి మాత్రం ఖాళీగా ఇళ్లకే పరిమితమైపోయారు.  కరోనా మహామ్మారి ప్రభావంతో తమ ఇంట శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు ప్రజలు. 

 

అయితే రాష్ట్రంలో వేల సంఖ్యలో చిన్న దేవాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే అర్చకులకు నెలకు 15వందల నుండి 3వేల వరకు ఆదాయం వచ్చే వారున్నారు. ఇతర ప్రాంతాల నుండి వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు.

 

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో.. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు 5వేలు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది అర్చకులు ఉన్నారు. వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని అందజేయనున్నారు. 

 

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మిగిలిన వారికి కూడా ఈ పథకం అందేలా చూడాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: