ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో వివిధ రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు  పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ప్రజల జీవితాలకు, వ్యవసాయానికి, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉభయతారకంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని అభ్యర్థించారు. 

 

 


భారతదేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్ పై పోరాడుతోంద‌న్న కేసీఆర్ ఇదే స్పూర్తితో కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ``కరోనాను భారతదేశం చాలా గొప్పగా ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ పత్రికలు కూడా మెచ్చుకుంటున్నాయి. 
కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తున్నది. మీరు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మీరు అండగా నిలవడం మాకు ఎంతో మనోధైర్యం ఇస్తున్నది. కరోనాపై జరిగే యుద్ధంలో భారతదేశం తప్పక గెలిచితీరుతుంది.`` అని ప్ర‌ధానితో తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ``లాక్ డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడింది. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించడం మంచింది. వైరస్ వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదు.``అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

 

``భారతదేశానికి వ్యవసాయమే జీవిక. దేశానికి అన్నం పెట్టడమే కాదు, వ్యవసాయం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి తిండి పెట్టడం మరే దేశానికి కూడా సాధ్యం కాదు. మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధితో ఉన్నాం. ఈ పరిస్థితి కొనసాగాలి. అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలి. అటు వ్యవసాయాన్ని కాపాడేందుకు, ఇటు ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఉండేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిచేలా చర్యలు చేపట్టాలి. రైసు మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలి. వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాలి. కనీసం రెండు నెలల పాటైనా ఈ విధానం అవలంభించాలి. రైతులు సగం కూలీ డబ్బులు భరిస్తే, మిగతావి నరేగా నిధుల నుంచి చెల్లించే విధానం రావాలి. దీనివల్ల కష్ట కాలంలో రైతులను ఆదుకోవడం సాధ్యమవుతుంది.`` అని కేసీఆర్ సూచించారు. 


``దేశ వ్యాప్తంగా కోట్లాది టన్నుల పంటలు పండాయి. వీటిని సేకరించడం మన ముందున్న కర్తవ్యం. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి స్థలం లేదు. ప్రజలకు మూడు నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలు ముందుగానే ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఎఫ్.సి.ఐ.లో ఉన్న నిల్వలు ఖాళీ అవుతాయి. అప్పుడు కొత్తగా వచ్చే పంటలను ఆ గోదాముల్లో నిల్వ చేయవచ్చు.` అని కేసీఆర్ సూచించారు. ``రైతులు మార్కెట్లో ఒకేసారి జమ కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లోనే 6,849 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. ఒక్క ధాన్యం సేకరణ కోసమే ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. గ్రామాల్లోనే పంటలు కొని, రైతుల అకౌంట్లో డబ్బలు వేస్తున్నాం. ఇలా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్.సి.ఐ.కి అందిస్తున్నాం. ఎఫ్.సి.ఐ. నుంచి తిరిగి డబ్బులు రావడానికి నాలుగైదు నెలల సమయం పడుతున్నది. అప్పటి వరకు బ్యాంకులు బకాయిల చెల్లింపుకోసం వత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.`` అని సూచించారు.

 

``1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 2008లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. సరైన చర్యలు తీసుకోవడం వల్ల కోలుకోగలిగాం. ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీన్ని ఎదుర్కోవడానికి కూడా వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరం. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్.బి.ఐ. అనుసరించాలి. దీన్నే హెలిక్యాప్టర్ మనీ అంటారు. దీనివల్ల రాష్ట్రాలకు, నిధులు సమకూర్చే సంస్థలకు వెసులు బాటు లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడవచ్చు. జిఎస్డిపిలో 5 శాతం నిధులను క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం ద్వారా విడుదల చేయాలి. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు వారాల పాటు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ``అని కేసీఆర్ ప్ర‌తిపాదించారు. ``ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రులతో ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలి. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయదారుల కోసం ఏమి చేయాలనే విషయంలో, ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో వ్యూహం ఖరారు చేసి, అమలు చేయాలి.`` అని కేసీఆర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: