ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ మీద ఎంత రాజకీయం జరుగుతుందో, నిన్నటివరకు  ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తప్పించడంపై కూడా అధికార, ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు. మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలని కరోనా ప్రభావం నేపథ్యంలో జగన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రమేష్ కుమార్ తనకున్న విచక్షణ అధికారాల్ని ఉపయోగించుకుని  వాయిదా వేయడంతో రచ్చ మొదలైంది.

 

అప్పుడే జగన్ తో పాటు వైసీపీ నేతలు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రమేష్ కుమార్, టీడీపీ లైన్ లోనే ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. అయితే నిదానంగా రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరగడంతో ఆ టాపిక్ పక్కకు వెళ్ళింది అనుకున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా చేయాల్సిన పని చేసేసింది. రహస్యంగా నిమ్మగడ్డ పదవీకాలం తగ్గిస్తూ, ఆర్డినెన్స్ తీసుకొచ్చి, దాన్ని గవర్నర్ చేత ఆమోదముద్ర వేయించుకుంది. దీంతో ఐదేళ్లు పదవిలో ఉండాల్సిన రమేష్ పదవీకాలం మూడేళ్లకు ముగిసింది. ఇక రమేష్ పదవీకాలం ముగియడమే తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించేసారు.

 

అయితే ఇలా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, ఆయన్ని దొడ్డిదారిన పదవి నుంచి తప్పించడం సరికాదని చంద్రబాబుతో సహా మిగతా విపక్షాల నేతలు  విమర్శలు చేస్తున్నారు. ఇక దీనికి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ, చంద్రబాబు... ఓ దళితుడు ఎలక్షన్ కమిషనర్ అయితే తట్టుకోలేకపోతున్నారని, ఆయనకి తన కులం వ్యక్తి నిమ్మగడ్డనే కావాలని మాట్లాడారు.

 

అయితే ఇక్కడ అంబటి చేసిన విమర్శలకు అసలు అర్ధం లేదు. అసలు కరోనాతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, ఇలాంటి సమయంలో నిమ్మగడ్డని తప్పించడం ఏంటని, పైగా కరోనా వ్యాప్తి పెరగకుండా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసి మంచి పని చేస్తే, ఆయన్ని పదవి నుంచి తప్పించడం సరికాదని మాట్లాడితే, అంబటి మాత్రం కనగరాజ్ దళితుడు, ఆయన్ని అధికారిగా నియమించడం చంద్రబాబుకి ఇష్టం లేదని అర్ధంపర్ధం లేని విమర్శచేసారు. అసలు కనగరాజ్ గురించి బాబు మాట్లాడనేలేదు. కానీ అంబటి మాత్రం కులం కార్డు వాడి మరి రాజకీయం చేసారు. ఇక దీని బట్టి చూసుకుంటే ఇలాంటి విపత్కర సమయంలో ఎవరు రాజకీయం చేస్తున్నారో బాగా అర్ధమైపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: