ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. రోజుకు కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా కరోనా దెబ్బతో విలవిల్లాడుతోంది. ఇదే సమయంలో అమెరికా కంటే ముందుగానే ఇండియాలో కరోనా ప్రవేశించినా.. ఇక్కడ దాని విజృంభణ చాలా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. విదేశాల్లో రోజుకు తక్కువలో తక్కువ వెయ్యి మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతుంటే.. ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 500 దాటలేదు.

 

 

ఇందుకు ప్రధానమైన కారణం.. భారత్‌లో సరైనా సమయంలో లాక్ డౌన్ విధించడం.. చైనా అనుభవంతో ఇండియా ముందుగానే మేలుకొంది. అదే ఇండియా కూడా కరోనాపై సన్నద్దత లేకుండా ఉండి ఉన్నట్లయితే ఏప్రిల్ 15 నాటికి దేశంలో కేసుల సంఖ్య 8 లక్షల కేసులు దాటిపోయేవట. అదే జరిగితే ఇండియాలోనూ కరోనా మరణాల సంఖ్య వేలల్లో ఉండేదన్నమాట.

 

 

ఈ విషయం ఎవరో కాదు.. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బయటపెట్టారు. కేంద్రం తగు చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిందని లవ్ అగర్వాల్ అన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయకుంటే, కట్టడికి చర్యలు తీసుకోకుంటే నలభై శాతం వృద్ది రేటుతో వైరస్ వ్యాప్తి అయి ఉండేదని ఆయన వివరించారు.

 

 

లాక్ డౌన్ ను అమలు చేయకుండా కేవలం కట్టడికే పరిమితం అయి ఉంటే ఏప్రిల్ 15కు దేశంలో 1.2 లక్షల కరోనా కేసులు ఉండేవని లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ కు ముందు కరోనా వ్యాప్తి 28.2 శాతంగా ఉందని ఆయన తెలిపారు. వామ్మో.. ఇండియా సకాలంలో లాక్‌డౌన్ చేయకుండా ఉండి ఉంటే ఎంత దారుణం జరిగి ఉండేదో అన్నది తలచకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: