రాజకీయ నాయకుడు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఇది సోషల్ మీడియా కాలం.. ఏ మాత్రం తేడా వచ్చినా ట్రోలింగ్‌ తో కుమ్మేస్తారు. ఈ విషయం తెలిసినా ఎందుకో కొందరు వైసీపీ మంత్రులు లెక్కచేయడం లేదు. తాజాగా మంత్రి మోపిదేవి వెంకటరమణ సైతం ఇదే పని చేశారు.

 

 

తాజాగా పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి రావాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో ఎవరిని మినహాయించేది లేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వకుండా హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార యంత్రాంగం తలమునకలై పనిచేస్తున్నారన్నారు. రైతులకు నష్ట్రం రాకుండా అన్ని జాగ్రత‍్తలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఆక్వా రంగానికి కనీస ధర నిర్ణయించామన్నారు. ఆక్వా ఫిషరీస్‌ రంగాలపై వచ్చిన నష్ట్రాలపై రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక అందజేస్తామని మంత్రి మోపిదేవి తెలిపారు. ఈ విషయాల వరకూ ఓకే కానీ.. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి రావాల్సిందేననడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

 

 

ఇక జగన్ సర్కారు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా నిమ్మగడ్డను పీకేసి తమిళనాడుకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ ను నియమించిన సంగతి తెలిసిందే. ఆయన హుటాహుటిన విజయవాడ వచ్చి పదవీబాధ్యతలు స్వీకరించారు కూడా. మరి ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబుకైనా క్వారంటైన్ తప్పదు అన్నవారు ఇప్పుడు కనగరాజ్‌ కు మాత్రం ఎలా మినహాయింపు ఇచ్చారంటూ టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: