ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు శిక్ష పడాలంటున్నారు. ఎందుకంటారా.. అసలే కరోనా కాలం ఉంది. కరోనా వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒకరికి కరోనా రావాలని కేసీఆర్ శపించడం అంటే కరోనాను వ్యాపింపజేయడమేనట. అందుకే... వాళ్లకీ, వీళ్లకీ కరోనా సోకాలని శపించడం ద్వారా ఆ వైరస్‌ వ్యాప్తిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు శిక్ష పడాలట..!

 

 

అసలు కేసీఆర్‌ శపించడం ఏంటి.. దాన్ని రాధాకృష్ణ తప్పబట్టడం ఏంటి అనుకుంటున్నారా.. దానికి కొంత నేపథ్యం ఉంది. తెలంగాణలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న రోగులకు సరైన వైద్య సదుపాయాలు, రక్షణ కిట్లు లేవంటూ ఆ మధ్య ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్.. ఆంధ్రజ్యోతి పేరు పెట్టకుండా ఆ పత్రిక ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. వైద్యుల సమస్యపై కథనం రాసిన ఆంధ్రజ్యోతి కి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తానని కూడా కేసీఆర్‌ హెచ్చరించారు.

 

 

రాష్ట్రమంతా కష్టకాలంలో ఉంటే ఇలాంటి రాతలు అవసరమా.. నీకు తెలుసా.. ఎన్ని కిట్లు ఉన్నాయో.. ఇలాంటి రాతలు రాస్తారా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీనిపై తాజాగా ఏబీఎన్‌ ఆర్కే తన ఆదివారం శీర్షిక కొత్త పలుకులో వివరణ ఇచ్చారు. అంతా తనకే తెలుసును అని భావిస్తున్న కేసీఆర్‌కు ఒక విషయం గుర్తుచేయాలంటున్న ఆర్కే.. ప్రభుత్వాలు కేసులు మాత్రమే పెట్టగలవని... శిక్షలు విధించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుందని రాశారు.

 

తనకు కరోనా వైరస్‌ సోకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శపించారని.. అయితే ఆయన కంటే అత్యంత శక్తిమంతుడైన దేవుడి దయవల్ల నేను ఇప్పటివరకు క్షేమంగానే ఉన్నానని ఆర్కే రాసుకొచ్చారు. అయినా మహమ్మారి కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాల్సిన ముఖ్యమంత్రి ఫలానా వారికి కరోనా వైరస్‌ సోకాలని శపించడం ఏమిటని ప్రశ్నించారు? ఇది హద్దులు లేని అసహనానికి ఇది నిదర్శనమని విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: