ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను కరోనా తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా పేరు వింటే చాలు ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏ జంతువు నుంచి కరోనా మనుషులకు సోకిందనే విషయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా సోకిందని విశ్వసిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ బ్యాట్‌ స్పెషలిస్ట్‌ గ్రూప్‌ సభ్యుడు డాక్టర్‌ చెల్మల శ్రీనివాసులు గబ్బిలాలతో మనుషులకు కరోనా సోకడం అబద్ధమేనని అన్నారు. 
 
కరోనాకు, గబ్బిలాల్లో ఉండే వైరస్ కు ఎటువంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. పులుసు పంది నుంచి కరోనా మనుషులకు సోకిందని.... గబ్బిలాల్లో ఉన్న వైరస్ కు, కరోనాకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) పులుసు పంది నుంచి కరోనా సోకినట్లు ప్రకటన చేసిందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న ఆయన 100 రకాల వైరస్ లు ఉంటే వాటిలో 40 శాతం గబ్బిలాల్లోనే ఉంటాయని చెప్పారు. 
 
మిగిలిన వైరస్ లు ఇతర జంతువుల్లో, పక్షుల్లో ఉంటాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువ శాతం వైరస్ లు మనుషులు జంతువులను తినడం వల్లే వచ్చాయని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ప్రబలిన సార్స్ పునుగు పిల్లి నుంచి మనుషులకు సోకిందని... 2013లో ప్రబలిన మెర్స్ ఒంటె నుంచి సోకిందని చెప్పారు. ఎబోలా గొరిల్లా నుంచి.... కరోనా పులుసు పంది నుంచి సోకిందని శ్రీనివాసులు వెల్లడించారు. 
 
కరోనా గబ్బిలాల వల్ల వచ్చిందని చెప్పడం నూటికి నూరు శాతం అబద్ధమేనని అన్నారు. గతంలో ఎబోలా సోకినప్పుడు వందల సంఖ్యలో గబ్బిలాలను చంపేశారని... గబ్బిలాలు పొలాలను పాడు చేసే కీటకాలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. గబ్బిలాల వల్ల పట్టణాల్లో దోమల బెడద తగ్గుతుందని చెప్పారు. భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: