రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు డాక్టర్ కి కరోనా వైరస్ సోకగా... అతని నుండి ఆసుపత్రి సిబ్బంది కి, పేషెంట్లకు కూడా వైరస్ వ్యాప్తి చెందింది. కేవలం రెండు రోజుల్లోనే అనగా మార్చి 19వ తేదీన భిల్వారా జిల్లాలో 27 కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో రాజస్థాన్ రాష్ట్రం మొత్తంలో భిల్వారా జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయినట్టు కూడా వైద్యాధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన ఈ జిల్లాలో గత ఇరవై రోజుల్లో కేవలం ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదయింది. గత పది రోజుల్లో ఈ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే భిల్వారా జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణలో 2015 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ టీనా దాబి కీలకమైన పాత్ర వహించారని... అందుకే అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కావడం లేదని తెలుస్తోంది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న భిల్వారా పట్టణం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగగానే... ఆ జిల్లా సబ్ డివిజనల్ కలెక్టర్ టీనా దాబి... సీనియర్ కలెక్టర్ రాజేంద్ర భట్ తో కలిసి ఆ జిల్లా మొత్తాన్ని తక్షణమే లాక్ డౌన్ చేసేసారు. జిల్లాలో ప్రతి చోటా తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దుకాణాలు, పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను, పెళ్లి మండపాలను, తదితర ప్రజా సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలను టీనా దాబి మూసివేశారు.



టీనా దాబి మాట్లాడుతూ... 'ఇటలీ దేశం లాంటి పరిస్థితి మా జిల్లాలో రాకూడదని మా యంత్రాంగం మొత్తం చాలా అప్రమత్తమై వైరస్ ఏ మాత్రం వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలను ప్రజలు పాటించేలా చర్యలు తీసుకున్నాము. అప్పట్లో మాకు ఉన్నది ఒకటే ఒక లక్ష్యం అది ఏంటంటే... కరోనా మహమ్మారిని అంతమొందించడం. గతంలో మా జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం ఆందోళనకు గురి చేసింది. కానీ మా జాగ్రత్తల వలన ఇప్పటివరకు ఏ కొత్త కేసులు నమోదు కాలేదు. నమోదైన 28 కేసులలో ఇప్పటి వరకు 17 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు' అని సంతోషం వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చారు.


బోపాల్ నగరం లో ఓ దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన టీనా దాబి తొలిసారిగా సివిల్ సర్వీస్ పరీక్షలలో పాస్ అయ్యారు కానీ కేవలం 52 శాతం మార్కులను సాధించారు. అయితే మళ్లీ ప్రయత్నించి 2015 సంవత్సరంలో ఐఏఎస్ పరీక్షలలో మొదటి స్థానాన్ని గెలుచుకొని రికార్డు సృష్టించారు. కేవలం 26 సంవత్సరాల వయసు గల టీనా దాబి చాలా గొప్పగా తన విధులను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: